'పక్కా కమర్షియల్'మూవీ రివ్యూ

- July 01, 2022 , by Maagulf
\'పక్కా కమర్షియల్\'మూవీ రివ్యూ

సినిమా రివ్యూ: పక్కా కమర్షియల్
నటీనటులు: గోపీచంద్, రాశీఖన్నా, సత్యారాజ్, రావు రమేష్, సప్తగిరి, అజయ్ ఘోష్ తదితరులు..
దర్శకత్వం: మారుతి
సంగీతం: జాక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
ఎడిటింగ్: ఎస్,బి.వుద్ధవ్
ప్రొడ్యూసర్లు: బన్నీ వాసు, ప్రమోద్ ఉప్పలపాటి
రిలీజ్ డేట్: జూలై 01 2022
గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్: వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ 

‘పక్కా కమర్షియల్’ అంటూ పేరులోనే కమర్షియల్‌ని పెట్టుకుని, కమర్షియల్ యాంగిల్‌లోనే పక్కాగా సినిమాని ప్రమోట్ చేశారు. గోపీచంద్‌కి చాలా కాలంగా సరైన హిట్టు లేదు. దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ప్రేక్షకుల అంచనాల్ని అందుకుని, గోపీచంద్‌కి కావల్సిన హిట్టును ‘పక్కా కమర్షియల్’ కట్టబెట్టిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
సూర్య నారాయణ మూర్తి (సత్యరాజ్) నీతికీ, న్యాయానికీ కట్టుబడి వుద్యోగ ధర్మానికి విలువ ఇచ్చే న్యాయ మూర్తి. అనూహ్యమైన పరిస్థితుల్లో తన తీర్పు వల్ల అన్యాయంగా ఓ అమాయకురాలు బలైపోయిందని తెలిసి, తన వుద్యోగానికి రాజీనామా చేసి, ఓ కిరాణ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. ఆయన కొడుకు లక్కీ (గోపీచంద్) కూడా న్యాయ వృత్తినే ఎంచుకుంటాడు. కానీ, తండ్రికి పూర్తిగా రివర్స్ లక్కీ. పక్కా కమర్షియల్. డబ్బులిస్తే చాలు, తిమ్మిని బమ్మిని చేసి, దోషిని సైతం నిర్దోషిగా నిరూపించగల టాలెంట్ వున్నోడు. ఎవరి కారణంగా (రావు రమేష్) అయితే, సత్య నారాయణ మూర్తి తన వుద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందో, అతని దగ్గరే లక్కీ అసిస్టెంట్ లాయర్‌గా చేరి, అన్యాయంగా అమాయకుల్ని బలి చేస్తూ, డబ్బులు కొల్లగొడుతున్నాడని తెలిసి వదిలేసిన నల్ల కోటు మళ్లీ ధరించి, కొడుక్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు సత్యరాజ్. మరి, ఈ తండ్రీ కొడుకుల పోరాటంలో చివరికి గెలిచిందేంటీ.? న్యాయంగా ఆలోచించే తండ్రి తీరా.? పక్కా కమర్షియల్‌గా ఆలోచించే కొడుకు తీరా.? అది తెలియాలంటే సినిమాని ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పర్‌ఫామెన్స్:
గోపీచంద్ లుక్ బాగుంది. చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఇక లక్కీగా గోపీచంద్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా అవలీలగా తన పాత్రకు తాను న్యాయం చేసేశాడు. ఇక రాశీఖన్నా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎక్కువ స్ర్కీన్ స్పేస్ కొట్టేసింది. సీరియల్ ఆర్టిస్టు నుంచి, లాయర్ అయిపోవడం వరకూ.. అనవసరమైన డైలాగులు చెప్పిందే పదే పదే చెప్పి కాస్త బోర్ కొట్టించేసింది. ఆఖరికి సత్యారాజ్ పాత్ర తాలూకు డైలాగులు కూడా రాశీఖన్నానే చెప్పేయడం ఇలా గోపీచంద్‌కి మించిన స్పేస్ రాశీఖన్నాకి ఇచ్చేశాడు ఎందుకో.. మరి  మారుతి. ఏది ఏమైతేనేం, తన వంతుగా తనకిచ్చిన పిచ్చి కామెడీ పాత్రను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ చేసేసింది. సత్యరాజ్ మంచి నటుడు. కానీ, ఆయన పాత్రను కూడా కామెడీ చేసేశాడు డైరెక్టర్. రొటీన్ పాత్రలోనే రావు రమేష్ కనిపించాడు. గెటప్ కాస్త మారింది అంతే. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల పరిధి మేరకు తమకు తోచిన రీతిలో ఛాన్సు దొరికినప్పుడల్లా కామెడీ తెగ పండించేశారు.

సాంకేతిక వర్గం పని తీరు:
మారుతి సినిమాలకు లాజిక్కులు వెతక్కూడదు. సినిమాటిక్ లిబర్టీని మారుతి బాగా ఫాలో చేస్తాడు. ‘పక్కా కమర్షియల్ కోసం కూడా అదే ట్రై చేశాడు. కుప్పలు తెప్పలుగా క్యారెక్టర్లను తీసుకున్నాడు ఈ సినిమా కోసం. సందు దొరికినప్పుడల్లా వారితో కామెడీ పంట పండించేశాడు. ఇదే సందు, అదే సందు.. అనుకుని, ఆర్టిస్టులు కూడా అదే పనిగా కామెడీ చేసేశారు. సత్యరాజ్ పాత్రలు చాలా బలంగా తీర్చి దిద్దుతారు. కానీ, మారుతి ఈ సినిమాలో ఆయన పాత్ర మీద కూడా అంతగా ఫోకస్ పెట్టలేదు. అలాగే టెక్నీషియన్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్‌లో ‘పక్కా కమర్షియల్..’ అంటూ వచ్చే ఆర్ఆర్ ఓకే కానీ, అది చాలదు. పాటలు విజువల్‌గా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు.


ప్లస్ పాయింట్స్:
మారుతి మార్కు కామెడీ
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
వీక్ క్లైమాక్స్

చివరిగా: ‘పక్కా కమర్షియల్’ పక్కా రొటీన్ స్టోరీ. ఇంట్లో కూర్చొని బిట్లు బిట్లుగా కామెడీ సీన్లు చూసి ఎంజాయ్ చేయగలం తప్ప, ధియేటర్ బొమ్మ కానే కాదనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com