రాజకీయ వాగ్బాణాల చక్రవర్తి ...!
- July 01, 2022
తెలుగు నాట ఎందరో హేమాహేమీలైన రాజకీయ నాయకులు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసినప్పటికీ వారందరి కంటే భిన్నమైన పంథాలో సాగి దేశవ్యాప్తంగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ ఘనాపాటి , ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. నేడు ఆయన 73వ జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణాన్ని గురించి క్లుప్తంగా మీ కోసం....
ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా చవటపాలెం అనే కుగ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు చిన్నతనం నుండి ఎంతో చురుకైన విద్యార్థి. హైస్కూల్ నాటికి ఆర్.ఎస్.ఎస్ పట్ల ఆకర్షితుడై నాటి నెల్లూరు జిల్లా ప్రచారక్ భోగాధి దుర్గాప్రసాద్ ప్రోద్బంతో విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టి సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ తరుపున నెల్లూరు నగరంలో ప్రముఖ విద్యార్థి నేతగా ఎదిగారు.
వెంకయ్య ను రాజకీయంగానే కాకుండా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో దుర్గాప్రసాద్ పాత్ర మరువలేనిది. వెంకయ్య ను ఆనాటి రాష్ట్ర స్థాయి సంఘ్ దిగ్గజ నాయకుడైన సోమేపల్లి సోమయ్యకు పరిచయం చేసి భావి రాజకీయ జీవితానికి బాటలు పరచడం జరిగింది. నెల్లూరు వి.ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం లో న్యాయ విద్య ను అభ్యసించారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయం లో విద్యార్థి నేతగా వెంకయ్య నాయుడు జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ ఉద్యమం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉన్నత విద్య అనంతరం సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించారు. జనసంఘ్ పార్టీ నాయకుడిగా సంఘ్ సహకారంతో జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు.
నెల్లూరు జిల్లాలో జనసంఘ్ కోసం పనిచేస్తున్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఏమర్జెన్సీ కి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అధ్వర్యంలో నడిచిన ప్రజా ఉద్యమంలో భాగమై జైలుకు సైతం వెళ్ళారు. జైల్లో ఉన్న సమయంలో వివిధ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పచుకుకోవడమే కాకుండా వారి రాజకీయ సిద్ధాంతాలను లోతైన అధ్యయనం చేసి తన రాజకీయ పరిధిని విస్తృతం చేసుకున్నారు.
ఏమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో వీలీనం కావడంతో ఆ రాష్ట్ర యువ విభాగం నాయకుడిగా 1977 లో ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైనా 1978 లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. నాటి శాసనసభకు ఎన్నికైన అతి పిన్నవయస్కుడైన ఎమ్మెల్యేలలో వెంకయ్య ఒకరు.
జనతా పార్టీ విచ్ఛిన్నం కావడంతో 1980 లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ(భాజపా) లో చేరిన వెంకయ్య నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పార్టీ యువ విభాగం యువమోర్చ అధ్యక్షుడిగా , అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి గా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. 1983 లో తెలుగదేశం పార్టీ ప్రభంజనం లో సైతం ఉదయగిరి నియోజకవర్గం నుండి రెండో సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 1985 లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఆనాటి భాజపా జాతీయ అధ్యక్షుడు అద్వానీ చర్యలు చేపట్టడంతో ఆంధ్రా నుండి వెంకయ్య కు అవకాశం రావడం ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన మలుపు. జాతీయ స్థాయిలో పార్టీ అధికార ప్రతినిధిగా మొదలై అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. భాజపా లో క్రైసిస్ మేనేజర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్యవాది మరియు గొప్ప పార్లమెంటేరియన్ , భాజపా జాతీయ నాయకుడిగా ఉంటూనే ప్రజాస్వామ్యం పట్ల జాగరుకుడై ఉండేవారు. స్వపక్షం , విపక్షం అనే వరుసలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన వారిని తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడంలో కీలకమైన పాత్ర పోషించారు.
వెంకయ్య నాయుడు కేవలం రాజకీయ దక్షుడు మాత్రమే కాదు గొప్ప పరిపాలన దక్షుడు కూడా అటల్ బీహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వ్యవస్థను యుద్ద ప్రాతిపదికన నిర్మించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు తాగు నీటిని అందించేందుకు పలు పథకాల రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణభివృద్ధి , పార్లిమెంటరీ మరియు సమాచార శాఖల మంత్రిగా గా పలు వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశ ప్రజందరి మన్నలు అందుకున్నారు.
వెంకయ్య సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నెగ్గుకు రావడం లో కీలకమైన పాత్ర పోషించినది ఆయనలోని వాక్చాతుర్యం. మొదటి సారి ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రులను మరియు వారి మంత్రులను ఉక్కిరబిక్కిరి చేశారు. అనంతరం జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం తన అనర్గళమైన భాషతో పాటుగా రాజకీయ వాగ్బాణాలు సందిస్తూ ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేవారు. పెరుగుతున్న వయస్సు తో పాటుగా తన వాగ్బాణాలకు మెరుగులు దిద్దుతూ చమత్కారం మిళితం చేస్తూ వచ్చారు.
వెంకయ్య నాయుడు లోని అపరిమితమైన రాజకీయ పరిజ్ఞానం , పాలనా దక్షత వంటి మరెన్నో గొప్ప సుగుణాలు కారణంగా ఆయన్ని దేశానికి ఉపరాష్ట్రతిగా మరియు రాజ్యసభ అధిపతిగా చేశాయి. రాజ్యసభ అధిపతిగా సభను సజావుగా నడిపిస్తూనే ఫలవంతమైన చర్చలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.
సుమారు 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అందరికి ఆమోద యోగ్యమైన నేతగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచి తెలుగు కీర్తిని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పిన వెంకయ్య నాయుడు లాంటి గొప్ప నాయకుడు ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణం.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి