దుబాయ్ నుంచి ముంబై వెళ్లిన జగిత్యాల వాసి కిడ్నాప్‌..

- July 01, 2022 , by Maagulf
దుబాయ్ నుంచి ముంబై వెళ్లిన జగిత్యాల వాసి కిడ్నాప్‌..

ముంబై: ముంబై విమానాశ్రయం వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య  ఆచూకి ఇంతవరకు దొరకలేదు.వారం రోజులుగా అతను కిడ్నాపర్ల  చెరలోనే ఉన్నాడు.పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు అతని ఆచూకి కనిపెట్టలేక పోయారు. తాజాగా శంకరయ్యను తాళ్ళతో కట్టేసిన ఫోటోను కిడ్నాపర్లు గురువారం అతడి కుమారుడు హరీష్ కు పంపించారు.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య(50) జూన్ 22న దుబాయ్ నుంచి ముంబై వచ్చాడు.విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు.సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కానీ ఇంతవరకు శంకరయ్య ఆచూకి కనిపెట్టలేకపోయారు.

ఇదిలా ఉండగా.. కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్‌నెట్‌ ద్వారా అతడి కుమారుడు హరీశ్‌ వాట్సాప్‌కు గురువారం పంపించారు.ఇంటర్‌ నెట్‌ ద్వారా ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు తమిళ్, మళయాల భాషల్లో మాట్లాడారని అతని కుమారుడు చెప్పాడు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకర య్యను వదిలిపెడతామని కిడ్నాపర్లు చివరికి తేల్చి చెప్పారు.మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేగలమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.శంకరయ్య భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయంగా గడుపుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం,మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని శంకరయ్య క్షేమంగా ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.నిందితులు ఎక్కడి నుంచి మాట్లాడేది తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్ ఫోన్ ద్వారా అతని కుమారుడితో మాట్లాడుతున్నారు.ఉపాధి కోసం శంకరయ్య దుబాయ్ వెళ్లాడు.దుబాయ్ నుంచి వచ్చిన శంకరయ్య దగ్గర డబ్బులు ఉండి ఉంటాయని కిడ్నాపర్లు అతడిని కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

శంకరయ్య వద్ద ఉన్న బ్యాగుల్లో డబ్బులు లేకపోవటంతో ఇంక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించటం మొదలు పెట్టారు.శంకరయ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళంలో మాట్లాడటంతో శంకరయ్యను తమిళనాడుకు తరలిస్తున్నారనే అనుమానంతో ముంబై పోలీసులు తమిళనాడుకు బయలు దేరి వెళ్లారు.కాగా శంకరయ్యను కిడ్మాప్ చేసిన వాళ్లు ఎవరనేది ఇంతవరకు తేలలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com