దూరాలు

నోట్లోనే ముడుచుకొని  పడుకున్న  నాలుక
మాట్లాడేందుకు మిగిలిందేదీ  లేనంత  నిశ్శబ్దం
నువ్వు  నాతో మాట్లాడవు
మునపటిలా నీలా    
పసలేని పాతంతా  ఇప్పుడొక  రోత 

కొన్ని రాళ్ళు
కొన్ని పువ్వులు
మీదకు విసిరేయబడినవి ఏవైతేనేం
జ్ఞాపకాలై  మిగిలినందుకు  అదృష్టమే
                                                  
వేసుకున్న  చెప్పులు
తొడుక్కున్న  బట్టలు
గర్వంగా గారాలు పోతున్న ఛాతి మీది బరువైన కీస      
నాకెప్పటికీ అర్థంకాని కొత్త  భాషను  నేర్పించాయి
నీకిప్పుడు                                   

దాచుకున్నవన్నీ  చేరోసగం  పంచుకో గలిగాం
పంచుకున్నవన్నీ పదిలంగా దాచుకోలేక పోయాం
ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నారు
మన ప్రపంచమింకా ఒంటరిగానే వుంది
రాత్రిళ్ళు నిద్ర పట్టక
తెల్లార్లు మెలకువ రాక

కదిలే ఘడియల అడుగుల సవ్వడు లిప్పుడు
ఊపిరి పోసుకుంటున్న దూరాలు

--పారువెల్ల(దుబాయ్)

Back to Top