శ్రీవారి భక్తులకు అలెర్ట్
- August 14, 2022
తిరుమల: శ్రీ వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇంకా చాలామంది క్యూలైన్ లలోనే నిల్చున్నారు.
ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు క్యూ లైన్లు వ్యాపించాయి అంటే భక్తుల తాకిడి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. శనివారం రాత్రి 8 గంటల వరకు 56వేల 546 మంది యాత్రికులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని టీటీడీ వెల్లడించింది.
వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20వ తేదీ వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
కాగా.. తిరుమలకు వచ్చే భక్తులందరికీ వసతి ఏర్పాటు చేయడం కష్టమని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తులు తిరుపతిలోనే వసతి పొంది, తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలన్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి జరుగనున్నాయి. భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణరథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహిస్తారు.
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







