మోదీ, పుతిన్ భేటీలో యుక్రెయిన్ యుద్ధంపై చర్చ...

- September 16, 2022 , by Maagulf
మోదీ, పుతిన్ భేటీలో యుక్రెయిన్ యుద్ధంపై చర్చ...

న్యూ ఢిల్లీ: ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం సమర్‌ఖండ్‌ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా తన తూర్పు ప్రాంతంలో ఉన్న యుక్రెయిన్‌ దేశంపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభం తర్వాత ఇరువురు నేతల మధ్య ఇది ​​మొదటి సమావేశం. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ఇతర ప్రపంచ సమస్యలతో పాటు యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది యుద్ధ యుగం కాదని, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఆందోళనల్లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతను పెంచిందని మోదీ పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. యుద్ధంపై మీ ఆందోళనను అర్థం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ బదులిచ్చారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణపై మీ వైఖరి గురించి నాకు తెలుసు, మీ ఆందోళనల గురించి నాకు తెలుసు. వీటన్నింటికీ వీలైనంత త్వరగా ముగింపు పలకాలని మేము కోరుకుంటున్నామని పుతిన్ అన్నారు. అక్కడ ఏమి జరుగుతుందో మేము మీకు తెలియజేస్తామని పుతిన్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

చర్చల ద్వారా సంక్షోభం పరిష్కారానికి ప్రయత్నిస్తూనే ఉన్నందున, యుక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి భారతదేశం ఏ గ్లోబల్ ఫోరమ్‌లోనూ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇదిలాఉంటే పుతిన్ తో భేటీకి ముందు.. సమర్‌ఖండ్‌లో ఎస్‌సీఓ సదస్సులో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో మోదీ సమావేశమయ్యారు, ఈ సందర్భంగా వారు విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com