సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‭లు..

- November 23, 2022 , by Maagulf
సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‭లు..

న్యూ ఢిల్లీ: సుప్రీం కోర్టులో నాలుగు కొత్త బెంచ్‭లు ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం వెల్లడించారు. వచ్చేవారం నుంచి ఈ ప్రత్యేక బెంచ్‌లు విచారణ ప్రారంభిస్తాయని చెప్పారు. క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల అంశాలు, భూఆక్రమణలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్‌ను ఈ ప్రత్యేక ధర్మాసనాలు విచారిస్తాయని తెలిపారు.

‘‘సుప్రీం కోర్టులో నాలుగు ప్రత్యేక బెంచ్‭లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవి క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, భూసేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్ వంటి అంశాలను విచారిస్తాయి’’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఓ కేసుకు సంబంధించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన అభ్యర్థనపై సీజేఐ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్‌ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశానికి సేవ చేయడమే తన ప్రాధాన్యతని, అది సాంకేతికత లేదా రిజిస్ట్రీ సంస్కరణలు లేదంటే న్యాయపరమైన సంస్కరణలు ఏవైనా కావొచ్చని అన్నారు. భారతదేశ పౌరులందరికీ రక్షణగా ఉంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com