కాల్ అంతరాయాలు ఏర్పడినప్పుడు, ఉచిత కాల్స్/ఉచిత నిముషాలు ఇవ్వాలని ..
- April 26, 2016
అప్పుడే జరిమానాపై పునరాలోచన సుప్రీంకోర్టుకు తెలిపిన ట్రాయ్ దిల్లీ కా ల్ అంతరాయాలకు సమానంగా ఉచిత కాల్స్ ఇచ్చేందుకు టెలికాం సంస్థలు షరతులు లేకుండా అంగీకరిస్తే, జరిమానా అంశాన్ని పునరాలోచిస్తామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సుప్రీంకోర్టుకు తెలిపింది. 100 కోట్ల మంది టెలికాం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయమని వివరించారు. 'కాల్ అంతరాయం ఏర్పడితే ఉచితంగా కాల్ ఇస్తామని' టెలినార్ సంస్థ ఇప్పటికే ప్రచారం చేస్తోందని, అయితే సొంత నెట్‌వర్క్ పరిధిలో అదీ 24 గంటల వ్యవధిలోనే చేసుకోవాలని కోరుతోందన్నారు. ఇలాంటి షరతులు లేకుండా ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌లో అంతరాయం ఏర్పడినా, ఇలాంటి సదుపాయాన్ని అన్ని టెలికాం సంస్థలు కూడా అమలు చేయాలని ట్రాయ్ కోరింది. ఇందుకు అంగీకరిస్తే, కాల్ అంతరాయాలపై టెలికాం సంస్థలకు విధించాలనుకుంటున్న జరిమానాపై పునరాలోచిస్తామని ట్రాయ్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన బెంచ్ ఎదుట ఆయన వాదించారు. చందాదారులకు పరిహారం ఇచ్చే విషయమై ట్రాయ్ సూచనలను టెలికాం సంస్థలు ఎప్పుడూ అంగీకరించలేదని తెలిపారు. కాల్ అంతరాయాలు ఏర్పడినప్పుడు, ఉచిత కాల్స్/ఉచిత నిముషాలు ఇవ్వాలని ట్రాయ్ సూచించిందని, అలా చేయడం సాధ్యం కాదని టెలికాం సంస్థలు పేర్కొన్నాయని రోహత్గి వివరించారు. టెలినార్ చేస్తున్న విధంగా 'కాల్ అంతరాయాలకు ఉచిత కాల్స్ సదుపాయం కల్పించమని' ఇతర టెలికాం సంస్థలను ట్రాయ్ ఎందుకు కోరలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 'ఉచిత సమయాన్ని ఇవ్వడం సాధ్యం కాదని, ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండటమే కారణమని టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఒకవేళ వినియోగదారుడు 2 రోజులకు మించి రోమింగ్‌లో ఉంటే, అసలు సాధ్యమే కాదని వాదించాయి. ఉచితంగా కాల్స్ ఇవ్వడం కూడా ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నాయి' అని ఏజీ తెలిపాయి. కాల్ అంతరాయాలకు ముఖ్య కారణం టెలికాం సంస్థలేనని, నెట్‌వర్క్-సాంకేతికత ఆధునికీకరణకు అవి పెట్టుబడులు పెట్టడం లేదని ఏజీ వాదించారు. చందాదారుల వద్ద నగదు పోగేసుకోవడంపైనే టెలికాం సంస్థలకు ఆసక్తి ఉంది అని పేర్కొంటూ, అందుకే ట్రాయ్ జరిమానాకు నిర్ణయించిందని ఏజీ వివరించారు.టెలికాం సంస్థలకు లాభం దేశంలోని 79 శాతం మంది మొబైల్ చందాదారులు సెకన్ల వారీ బిల్లింగ్‌లో ఉన్నారని, మిగిలిన వారికి నిమిషాల వారీ బిల్లు పడుతోందని ఏజీ తెలిపారు. కాల్ అంతరాయాల వల్ల టెలికాం సంస్థలు లాభపడుతున్నాయని, మరిన్ని అదనపు కాల్స్ చేయాల్సి రావడమే ఇందుకు కారణమన్నారు. నిమిషం బిల్లింగ్‌లో ఉన్న చందాదారుకు 15 సెకన్ల తరవాత కాల్ కట్ అయితే మరో కాల్ చేయాల్సి వస్తోందని గుర్తు చేశారు. మొత్తం కనెక్షన్లలో 96 శాతం ప్రీపెయిడ్ అని, రోజుకు సగటున రూ.10 చొప్పున రీచార్జి చేసుకుంటారని, అంటే 60-70 కోట్ల మంది ముందస్తుగా నగదును టెలికాం సంస్థలకు జమ చేస్తున్నారని ఏజీ తెలిపారు. ఇందువల్ల వారికి వడ్డీ ఏమీ రావడం లేదని, అయినా రోజుకు రూ.3 మించకుండా పరిహారం ఇచ్చేందుకు టెలికాం సంస్థలు వెనుకాడుతున్నాయని పేర్కొన్నారు. జరిమానా విధించకుండా కోర్టుల స్టే ఏమీ లేదని, అయితే టెలికాం సంస్థలు వివరాలు సమర్పించనందున, వూరుకున్నట్లు వివరించారు. దీనిపై విచారణ బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







