గల్ఫ్ ఉద్యోగానికి చమురు సెగ
- May 01, 2016
గల్ఫ్ ఉద్యోగానికి చమురు సెగ
ప్రోత్సాహకాలు, వేతనాల్లో కోత
అవసరమైతే ఉద్యోగుల తొలగింపు
పొదుపు చర్యల్లో కంపెనీలు
విదేశీయులపై ప్రత్యేక పన్నులు
ప్రవాసులపై ప్రభావం
గత ఏడాదిన్నర కాలంలో ముడి చమురు ధర 70 శాతానికి పైగా తగ్గి పీపా ధర 44-46 డాలర్ల మధ్య కదలాడుతోంది. సమీప భవిష్యత్తులో కూడా చమురు ధరలు పెరగడానికి అవకాశాలు కనిపించడం లేదు. ముడి చమురు అవసరాల్లో 70 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ఇది అత్యంత అనుకూల పరిణామం. కరెంట్ ఖాతా లోటు పరిమితమవుతుంది. ప్రభుత్వంపై సబ్సిడీ ఒత్తిడి, దిగుమతుల భారం తగ్గుతుంది. అయితే. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చమురు ఎగుమతులపైనే ఆధారపడిన గల్ఫ్ దేశాల్లో (సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యూఏఈ) పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో అక్కడి కంపెనీలు పొదుపు చర్యలు చేపడుతున్నాయి. విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. వేతనాలు, ప్రోత్సాహకాల్లో కోత విధిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాల చేస్తున్న వారిపై ప్రభుత్వాలు ప్రత్యేక పన్నులు విధిస్తున్నాయి. ఈ పరిణామాలు పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులపై పడుతోంది. నైపుణ్యాలు లేని సాధారణ శ్రామికుల నుంచి ఇంజినీర్లు, ప్రత్యేక నిపుణుల వరకూ ఉద్యోగం ఎప్పుడు చేజారుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
50% రెమిటెన్స్ గల్ఫ్ దేశాల నుంచే: విదేశాల్లో పని చేస్తూ.. భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు భారతీయులు పంపే నగదు (రెమిటెన్స్)లో దాదాపు 50 శాతం నగదు గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు గత ఏడాది (2015)లో తమ దేశానికి 6,900 కోట్ల డాలర్ల (దాదాపు రూ.4,27,800 కోట్లు) పంపారు. 2014లో పంపిన 7,000 కోట్ల డాలర్లతో పోలిస్తే 100 కోట్ల డాలర్లు తగ్గినప్పటికీ.. రెమిటెన్స్‌లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. గతంలో చమురు ధరల్లో ఒడుదొడుకులు కారణంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. స్వల్పకాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయని, ఈసారి దీర్ఘకాలంగా చమురు ధరలు కుంగడం గల్ఫ్ దేశాల్లోని కంపెనీలపై బాగా ప్రతికూల ప్రభావం చూపుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చమురు, గ్యాస్, ఫైనాన్స్, బ్యాంకింగ్, వాహన, నిర్మాణ, రియల్ ఎస్టేట్, పర్యాటకం వంటి రంగాల్లోని కంపెనీలు అధికంగా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. దీంతోపాటు గతంలో ప్రజాకర్షక విధానాలు అవలంబించే చమురు ఎగుమతి దేశాలు ఇప్పుడు నిబంధనలను, పన్నులను విధిస్తున్నాయి. గతంలో విదేశాల నుంచి వచ్చి పని చేసే వారి వేతనాలపై గల్ఫ్ దేశాల్లో ఆదాయపు పన్ను విధించే వారు కాదు. ఇది అక్కడ ఉద్యోగాలను ఇష్టపడడానికి ప్రధాన కారణాల్లో ఒకటని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
జీవన వ్యయం పెరుగుతోంది: ఒమన్‌లో ప్రారంభ స్థాయి ఇంజినీరుకు 2,500 రియాల్స్ వరకూ వేతనం ఉండేది. ఇప్పుడు అది 700-800 రియాల్స్ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఒమన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల విదేశాల నుంచి వెళ్లి పని చేస్తున్న వారి జీవన వ్యయం బాగా పెరిగిపోతోంది. పన్నులు, యుటిలిటీ రుసుములు, ఇంటి అద్దెలు, పాఠశాల రుసుముల పెంపు కారణంగా జీవన వ్యయం పెరిగి అక్కడి ప్రవాసులు తమ కుటుంబ సభ్యులను వెనక్కి పంపుతున్నారు. ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ‘విదేశీ వర్కర్లు’ ఉన్నారు. గల్ఫ్ దేశాల జనాభాలో దాదాపు 48 శాతం మంది విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారే. సౌదీ అరేబియాను మినహాయిస్తే మిగిలిన దేశాల్లో సగానికి పైగా జనాభా విదేశాల నుంచి వెళ్లిన వారే. సౌదీ అరేబియాలో అత్యధికంగా దాదాపు 90 లక్షల మంది విదేశీ వర్కర్లు ఉన్నట్లు అంచనా. గల్ఫ్ దేశాల్లో దాదాపు 2 కోట్ల మంది విదేశీ వర్కర్లు ఉన్నారు.
గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న వారిలో ఈజిప్ట్, సిరియా, పాకిస్థాన్, భారత్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక దేశాల నుంచి వెళ్లిన వారే. వీరిలో అత్యధికంగా భారత్ నుంచి వెళ్లిన వారే. తర్వాతి స్థానంలో ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ ఉంటాయి.
2015లో యూఏఈ నుంచి 1,320 కోట్ల డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 1,100 కోట్ల డాలర్లు, కువైట్ నుంచి 480 కోట్ల డాలర్లు, ఖతార్ నుంచి 420 కోట్ల డాలర్లు రెమిటెన్స్ రూపంలో భారత్‌కు వచ్చినట్లు అంచనా.
భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకే అధికంగా వస్తున్నాయి. భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో దాదాపు 50 శాతం ఈ రాష్ట్రాలకే వస్తున్నట్లు అంచనా.
గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న విదేశీయులు తమ, తమ దేశాలకు ఏడాదికి మొత్తం దాదాపు 100 బిలయన్ డాలర్లు పంపుతున్నారు.
‘అక్కడి వాళ్ల కంటే భారత్, పాకిస్థాన్ వంటి దేశాల నుంచి వెళ్లిన వారు అయిదు రెట్లు అధికంగా పని చేయడమే కాక తక్కువ వేతనానికి లభిస్తారు. అందుకే భారత్, తదితర దేశాలకు చెందిన శ్రామికులు, నిపుణులు, ఉద్యోగులను నియమించుకోవడానికి గల్ఫ్ కంపెనీలు ఇష్టపడతాయి. అంతేకాక గతంలో అక్కడ శ్రామికులకు కొరత ఉండేది. పని చేయడానికి ఇష్టపడే వారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారి పోవడంతో అక్కడి వారే తక్కువ వేతనాలకు పని చేయడానికి ముందుకు వస్తున్నారు. చమురు ధరలు తగ్గి ఆదాయానికి గండి పడడంతో టెలికామ్, రిటైల్ వంటి రంగాల్లో ప్రాజెక్టుల వేగం తగ్గింది. ఆటో రంగంలో కార్ల అమ్మకాలు తగ్గడంతో షోరూమ్‌ల్లో పని చేస్తున్న విదేశీయులను తొలగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల నుంచి ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరమైన శ్రామికులు, తక్కువ నైపుణ్యం, నైపుణ్యం లేని శ్రామికులు ఏడాదికి దాదాపు లక్ష మంది వరకూ వెళుతూ ఉంటారు (పని అనుమతి పత్రం తీసుకుని వెళ్లాలి. దాని గడువు పూర్తయితే మళ్లీ తీసుకోవాలి). ఇందులో 20 శాతం మంది నిర్మాణ పనులు చేసే వారు, వడ్రంగి, ఏసీ మెకానిక్‌లు, ప్లంబర్లు, వెల్డర్లు వంటి వారు ఉంటారు. వీరు కాక ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరం లేని పై స్థాయి నిపుణులు అనేక మంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఇదే పరిస్థితులు కొనసాగితే ఆ దేశాల్లోని కంపెనీలు నియామకాలను మరింత కఠినం చేస్తాయి. అనుభవం ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తాయి. వేతనాలను మరింతగా తగ్గిస్తాయి. ఇక్కడి నుంచి ఉద్యోగులు వెళ్లడానికి ఇష్టపడకపోతే, బంగ్లాదేశ్ వంటి దేశాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల నుంచి శ్రామికులను, నిపుణులను తీసుకువెళతాయి. దీని వల్ల మనకు అవకాశాలు తగ్గుతాయి.
--బ్రహ్మ రెడ్డి సఖిల
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







