విదేశాలలో భారత్ ను అవమానించేలా మోడీయే మాట్లాడుతున్నారు: రాహుల్ గాంధీ
- March 06, 2023
న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై భారతదేశ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించింది తాను కాదని, స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీయే ఆ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 60, 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనల సందర్భంగా వ్యాఖ్యానించారని రాహుల్ గుర్తుచేశారు. లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాలలో మన దేశ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించారు. ఇందులో భారత్ ను అవమానించేలా రాహుల్ మాట్లాడారంటూ బిజెపి నేతలు మండిపడుతున్నారు.
తన వ్యాఖ్యలను, మాటలను వక్రీకరించడం బిజెపి నేతలకు అలవాటేనని రాహుల్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రపంచ వేదికలపై మన దేశాన్ని కించపరుస్తున్నది మోడీనేనని చెప్పారు. భారతదేశం మొత్తం అంతులేని అవనీతితో నిండిపోయిందని విదేశాల్లో మోడీ చెప్పినట్లు తనకు గుర్తుందన్నారు. 2015 లో ప్రధాని మోడీ దుబాయ్, సౌత్ కొరియాలలో పర్యటించారని రాహుల్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత, తప్పుడు నిర్ణయాలతో దేశం ఇప్పటికీ ఇబ్బందిపడుతోందని మోడీ ఆరోపించారన్నారు. భారత్ లో పుట్టినందుకు చింతిస్తూ కొంతమంది యువత దేశం విడిచి వెళ్లిన రోజులు ఉన్నాయని సౌత్ కొరియాలో మోడీ మన దేశాన్ని విమర్శించారని ఆరోపించారు. విదేశాలలోనే కాదు.. మన దేశంలోనూ భారత్ ను తానెప్పుడూ అవమానించలేదని రాహుల్ గాంధీ చెప్పారు. ఇంతకుముందు అలా చేయలేదు, ఇకపైనా చేయబోనని రాహుల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







