టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ విషయంలో నిర్లక్ష్యమొద్దు

- June 21, 2015 , by Maagulf
టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ విషయంలో నిర్లక్ష్యమొద్దు

టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ గొంతులో వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కడైనా రావచ్చు. ఇవి రెండూ ఒక రకానికి చెందినవే. అయితే టాన్సిల్స్‌ మాత్రం జీవితాంతం ఉంటాయి. కాకపోతే వయసు పెరిగే కొద్దీ వీటి సైజు కొంత మేర తగ్గే అవకాశం ఉండొచ్చు. కానీ పూర్తిగా తగ్గిపోతాయనడానికి మాత్రం అవకాశం లేదు. కానీ అడినాయిడ్స్‌ మాత్రం చిన్న వయస్సులో మొదలయ్యి, 12-13 ఏళ్ల వయసు వచ్చే సరికి కొంచెం కొంచెంగా కుంచించుకుపోయి, యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అడినాయిడ్స్‌ సమస్య చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక టాన్సిల్స్‌ విషయానికొస్తే, వీటితో సమస్య ఏ వయసు వారికైనా ఉండొచ్చు. కానీ ఇది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా పిల్లలు స్కూళ్లల్లోనో, నలుగురితో కలిసి ఆటలాడుతున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి బాక్టీరియా, వైరస్‌ల వంటివి సులభంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. ఆ రకంగానే ‘స్రెప్టోకాకస్‌’ అనే బాక్టీరియా కారణంగా గొంతు నొప్పితో ఈ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా టాన్సిల్స్‌కు ఇన్ఫ్‌క్షన్లు వస్తే, ఆ ఇన్ఫెక్షన్‌ గొంతు నుండి శరీరంలోని ఇతర భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. అందుకే టాన్సిల్స్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.
ఇక అడినాయిడ్స్‌ వాపు వల్ల ముక్కు నుంచి చెవి వరకూ ఉండే గొట్టం మూసుకుపోయి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కర్ణబేరి వెనకాల నీరు చేరి, చెవి ఇన్ఫెక్షన్స్‌, వినికిడి లోపం వంటి పెద్ద సమస్యలు బయల్దేరతాయి. ఎదిగే వయస్సులో పిల్లలకూ తరచూ ఈ చెవి ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటే వారికి మాటలు రావడం కూడా ఆలస్యం కావచ్చు. ఈ టాన్సిల్స్‌, అడినాయిడ్స్‌ అనేవి పిల్లల్లోనూ, పెద్దల్లోనూ కూడా కనబడొచ్చు. కాబట్టి వీటి సమస్య మరింత ఎక్కువగా బాధిస్తుంటే తగిన వైద్య సలహా మేరకు సర్జరీ ద్వారా తొలగించడమే మంచిదని తాజా అధ్యయనాల వెల్లడి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com