ఉడుత ఉపాయం

- June 22, 2015 , by Maagulf
ఉడుత ఉపాయం


ఒక అడవిలో రకరకాల జంతువులూ, పక్షులూ, పాములూ ఉండేవి. వాటన్నింటికి రాజు సింహం. రాజుననే గర్వంతో సింహం తనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉండేది. ఆకలిగా ఉన్నా, లేకపోయినా జంతువుల వెంట పడి వాటిని భయభ్రాంతులను చేసేది. అవి భయంతో పరుగులు పెడుతుంటే దానికి సరదాగా ఉండి రోజూ జంతువులను ఆట పట్టించేది. వాటికి మాత్రం ఇదంతా ప్రతి రోజూ ప్రాణ సంకటం అయ్యేది. అయితే ఇదంతా రోజూ ఒక ఉడుత చెట్టు మీద నుంచి గమనిస్తూ ఉండేది. ఎలాగైనా ఈ సింహానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. సింహం దగ్గరకు వెళ్లి ‘సింహ రాజా! నువ్వు చాలా బలశాలివి. నిన్ను చూసి ఎవరైనా భయపడి పారిపోతారని విర్రవీగుతున్నావు. కానీ నేను నీ కన్నా చాలా చిన్నవాడిని. అయినా నేను నిన్ను చూసి భయపడను. కావాలంటే నన్ను పట్టుకో చూద్దాం ’ అంటూ కవ్వించింది. దాని మాటలకి సింహానికి అరికాలి మంట నెత్తికెక్కింది. ‘ నా పాదమంతైనా లేని నువ్వు నన్ను వెటకారం చేస్తావా. ఉండు నీ సంగతి ఇప్పుడే చూస్తాను’ అంటూ దాని మీదకి ఉరికింది. ఈ అవకాశం కోసమే చూస్తున్న ఉడుత ఇరుకుప్రాంతాల నుండీ, చెట్టు పొదల మధ్య నుండీ, గెంతసాగింది. సింహం ఎంత వేగంగా పరుగెత్తినా అంతకు మించి వేగంతో ఉడుత పరుగెత్తసాగింది. ఎంతకీ ఉడుత అందకపోవడంతో సింహం మరింత వేగంగా దాన్ని వెంబడిరచసాగింది. అది గమనించిన ఉడుత ఒక లోయ వెంబడి ఉన్న చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. అది గమనించక వేగంగా పరుగెడుతున్న సింహం ఉదుత ఎక్కిన చెట్టును ఢీకొట్టి, ఒళ్లు తూలడంతో పట్టు జారి లోయలో పడిపోయింది. తన పథకం ఫలించినందుకు ఉడుత ఎంతో సంతోషించి మిగిలిన జంతువులన్నింటినీ పిలిచి జరిగిందంతా చెప్పింది. సింహం బారి నుండి తమని కాపాడినందుకు అడవిలోని జంతువులన్నీ ఉడుతను పొగడ్తలతో ముంచెత్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com