తెలుగు సినీ గేయ రచయిత 'సిరాశ్రీ' తో పాటా మంతీ
- June 22, 2015మీ పాట ప్రయాణం ఎలా మొదలైంది?
పాటతో నా ప్రయాణం బాల్యంలోనే మొదలైంది. తట్టిన ఆలోచనల్ని తోచిన బాణీలో పాటలు రాసుకుంటూ ఉండేవాడిని. క్లాస్ రూం లో వెనుక బెంచీలో కూర్చుని చేసిన పని అదే. కాలేజీకొచ్చే సరికి ఆ పిచ్చి ముదిరి ఫ్రంట్ బెంచీలో కూర్చోనే ప్రొఫెసర్ల కంట పడకుండా నోట్ బుక్ వెనుక పేజీల్లో రాసుకునేవాడిని. ఇక సినిమాపాట రాయడానికి అవకాశమిచ్చింది మాత్రం నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకులు మధురా శ్రీధర్. సినిమా "స్నేహగీతం". "ఒక స్నేహమే..." నేను రాసిన తొలి సినిమాపాట.
ఓ పాట రాయడానికి మీరు ఏయే అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు?
దర్శకుడు చెప్పే సన్నివేశం, సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీ..ప్రధానంగా ఈ రెండూ దృష్టిలో పెట్టుకుని ఏదైనా కొత్తగా చెప్పాలనే ఆలోచన చేస్తాను. చివరిగా దర్శకుడికి నచ్చితేనే ఆ ఆలోచన శ్రోతలకి వినిపిస్తుంది.
ట్రెండ్‌కి తగ్గట్టుగా బాణీలు, ఆ బాణీలకు తగ్గట్టుగా లిరిక్స్ రాయడం మీకెలా అన్పిస్తోంది?
సరదాతో నిండిన తపనతో కూడిన తపస్సులాగ అనిపిస్తుంది.
మాస్ సాంగ్స్, క్లాస్ సాంగ్స్‌ల్లో ఏది రాయడం కష్టం? మీకేది ఇష్టం?
ట్యూన్ లో మ్యాజిక్ ఉంటే అన్ని రసాలు వాటంతట అవే పొంగుకొస్తాయి.
ఓ సినిమాలో కాస్సేపు కనిపించే పాత్రలో నటించినట్టున్నారు, తెరపై నటించాలని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుందా?
"స్నేహగీతం"లో 15 సెకన్లు, "లేడీస్ అండ్ జెంటిల్మెన్"లో ఒక 5 సెకన్లు కనిపించానంతే. దానికి "నటన" అనే పెద్ద పేరు పెట్టక్కర్లేదేమో. సినిమా రంగంలో పనిచేసే వారిలో నూటికి 95 మందికి తెరపై కనిపించాలనే సరదా ఉంటుంది. "అలాంటిదేమీ లెదండీ" అంటే మాత్రం అది నూరు శాతం అబధ్ధం.
పాటల్నే కాకుండా గజల్స్‌నీ రాస్తుంటారు కదా, ఏది ఎక్కువ సంతృప్తినిస్తుంది?
రెండూ. కానీ గజల్లో చాలెంజ్ ఎక్కువ. ప్రతి షేర్ చప్పట్లు కొట్టించేలాగో, వహ్వా అనిపించేలాగో రాస్తేనే గొప్ప గజల్ అవుతుంది. ఈ విషయంలో గజల్ శ్రీనివాస్ గారిని తలచుకోకుండా ఉండలేను. కవిగా నా పరిధి పెంచే స్ఫూర్తిని చాలానే ఇచ్చారాయన.
భాష మీద పట్టున్న పాటల రచయితగా, గజిబిజి పాటలపై ఎలా స్పందిస్తారు?
నవ్వుతో స్పందిస్తున్నాను.
మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏమిటి? ఎందుకు?
అన్ని నచ్చినవే. ఏవరన్నా ఫలానా పాట బాగుందంటూ మెసేజ్ పంపినప్పుడల్లా ఆ పాట మరింత నచ్చుతుంటుంది.
అర్థవంతమైన పాట, అర్థం లేకపోయినా అలరించే పాట.. మీ ఓటు దేనికి?
రచయితగా మొదటిదానికి, శ్రోతగా రెండో దానికి.
కొత్తగా పాటల రచయితలుగా మారాలనుకునేవారికి మీరిచ్చే సూచనలు, సలహాలేమిటి?
ఇష్టం వచ్చినట్టు, ఇష్టానికి తోచినట్టు రాసేయండి. ఎవరి సూచనలు, సలహాలు పాటించకండి.
పాటల రచయితగా మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
ప్రస్తుతం రాం గోపాల్ వర్మ గారి "ఎటాక్", "సీక్రెట్", "కిల్లింగ్ వీరప్పన్", "రాయ్" ; మధురా శ్రీధర్ తీస్తున్న ఓ కొత్త చిత్రం, పీవీపీ బ్యానర్ మీద వస్తున్న "క్షణం", కోనా వెంకట్ గారు తీస్తున్న "శంకరాభరణం", సముద్ర గారి డైరెక్షన్ లో వస్తున్న రెండు సినిమాలు, సునీల్ కుమార్ రెడ్డి గారు తీస్తున్న "గల్ఫ్".
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి