ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత

- May 26, 2023 , by Maagulf
ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.సీనియర్‌ దర్శకుడు కె.ప్రత్యగాత్మ కుమారుడే కె.వాసు. ఆయన బాబాయి హేమాంబరధరరావు దర్శకులే. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'ఆడపిల్లల తండ్రి'. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 'ప్రాణం ఖరీదు'తో ఈయనే చిరంజీవిని నటుడిగా పరిచయం చేశారు. 'కోతల రాయుడు', 'సరదా రాముడు', 'పక్కింటి అమ్మాయి', 'కలహాల కాపురం', 'అల్లుళ్ళస్తున్నారు', 'కొత్త దంపతులు', 'ఆడపిల్ల', 'పుట్టినిల్లా మెట్టినిల్లా' వంటి చిత్రాలు వాసుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వాసు దర్శకత్వం వహించిన 'అయ్యప్పస్వామి మహత్యం', 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి. 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' పాటలు అప్పటికి, ఇప్పటికీ అజరామరం. 2008లో విడుదలైన 'గజిబిజి' సినిమా తర్వాత వాసు దర్శకత్వానికి దూరమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com