తెలుగువారికి శుభవార్త.. హైదరాబాద్‌లో యూఏఈ 4వ కాన్సులేట్ ప్రారంభం
- May 29, 2023
హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వీసా దరఖాస్తుదారులకు శుభవార్త. న్యూఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలోని కాన్సులేట్ల తర్వాత హైదరాబాద్‌లో నాల్గవ దౌత్య మిషన్‌ను యూఏఈ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని కొత్త కాన్సులేట్ జనరల్ కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసా దరఖాస్తుదారులకు మాత్రమే కాకుండా తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్ వంటి ఇతర దక్షిణ, మధ్య భారత రాష్ట్రాల వారికి కూడా సేవలను అందించనుందని హైదరాబాద్‌లోని యూఏఈ కాన్సుల్ జనరల్ ఆరేఫ్ అల్నూయామి (Aaref Alnuaimi) తెలిపారు.
దాదాపు 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొత్త యూఏఈ కాన్సులేట్ బంజారాహిల్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. దీనిని జూన్ 14న అధికారికంగా ప్రారంభించనున్నారు. కాన్సులేట్ ప్రారంభంలో రోజుకు 200 దరఖాస్తులను ప్రాసెస్ చేయనున్నామని, రెండు నెలల్లో రోజుకు 500 దరఖాస్తులు, భవిష్యత్తులో ప్రతిరోజూ 700-800 వీసాల వరకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆరేఫ్ అల్నూయామి వెల్లడించారు.
హైదరాబాద్, దక్షిణ భారతదేశం నుండి వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున హైదరాబాద్‌లో కాన్సులేట్ తెరవాలని నిర్ణయించినట్లు ఆరేఫ్ అల్నూయామి చెప్పారు. కొత్త మిషన్, వీసా దరఖాస్తుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. "హైదరాబాద్‌లో వీసాల కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మేము ఇప్పటికే ఇక్కడ రెసిడెంట్ వర్కర్ వీసా సౌకర్యాలను అందిస్తున్నాము. సమీప భవిష్యత్తులో ఇతర అన్ని రకాల వీసాలకు కూడా మా సేవలను విస్తరిస్తాము" అని కాన్సుల్ జనరల్ చెప్పారు.
తిరువనంతపురంలోని కాన్సులేట్ జనరల్‌లో తెలంగాణకు చెందినవారి దరఖాస్తులు అధికంగా ఉన్నాయన్నారు. అదే విధంగా చాలా మంది యూఏఈ పౌరులు వైద్య, విద్యా కారణాల కోసం హైదరాబాద్‌కు వస్తారని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై స్పందిస్తూ.. 2021-22లో భారతదేశం మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఏఈ ఉందని, 1970లలో కేవలం US$ 180 మిలియన్ల వాణిజ్యం జరుగగా.. ఈ రోజు రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారు US$ 73 బిలియన్లకు పెరిగిందన్నారు. భారతదేశం-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) సంతకం తర్వాత రెండు దేశాల మధ్య చమురుయేతర వాణిజ్య భాగం ఇప్పుడు వేగంగా పెరుగుతోందని, 2027 నాటికి US $ 100 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని కాన్సుల్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







