'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- June 30, 2026
దుబాయ్, జూన్ 30: యూఏఈలో ప్రారంభమైన ప్రముఖ స్టార్టప్ పెట్టుబడుల రియాలిటీ సిరీస్ 'ది గేమ్‌చేంజర్స్ మిడిల్ ఈస్ట్' కు పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుల గడువు ముగియకముందే 1,500 మంది వ్యవస్థాపకులు (ఫౌండర్లు) తమ దరఖాస్తులను సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
యూఏఈతో పాటు మధ్యప్రాచ్యం, భారత్, సింగపూర్, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. టెలివిజన్ కార్యక్రమంగా మాత్రమే కాకుండా, స్టార్టప్‌లకు పెట్టుబడులు, మార్గదర్శకత్వం, వ్యాపార అనుసంధానాలు, ప్రచారం కల్పించే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త ఆర్. మాధవన్ సహ-సృష్టికర్త, వ్యాఖ్యాత, మెంటర్, వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ, "ప్రతి గొప్ప సంస్థ ఒక ఆలోచనపై ఉన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ఆవిష్కరణలకు యూఏఈ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది. ధైర్యమైన ఆలోచనలు కలిగిన వ్యవస్థాపకులను గుర్తించి, వారికి ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం" అని అన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత విపుల్ డి. షా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు. ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తల ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
జూలై 5, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అందిన దరఖాస్తుల నుంచి 70 అత్యుత్తమ స్టార్టప్‌లను ఎంపిక చేసి, ప్రముఖ పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణుల ముందుకు తమ వ్యాపార ఆలోచనలను ప్రదర్శించే అవకాశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమం 2026 చివర్లో కలర్స్ టీవీ మిడిల్ ఈస్ట్‌లో ప్రసారం కానుండగా, ప్రముఖ ఓటీటీ వేదికల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. కార్యక్రమం ముగిసే నాటికి మొత్తం దరఖాస్తుల సంఖ్య 2,000 దాటే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







