తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన వెంకయ్య నాయుడు
- June 23, 2023
విశాఖపట్నం: భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారి 75వ జన్మదినోత్సవ సందర్భంలో... 50 ఏళ్ళ ప్రజా జీవన ప్రస్థానాన్ని పురస్కరించుకుని, గతంలో వారి దగ్గర వివిధ హోదాల్లో సేవలు అందించిన సహచర బృందంతో ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ ప్రతి ఒక్కరినీ సత్కరించారు. విశాఖపట్నంలోని ఏ-1 కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి గతంలో వారి దగ్గర పని చేసిన వ్యక్తిగత సహాయకులు మొదలుకుని, ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి, పరిచయం చేసిన ముప్పవరపు వెంకయ్యనాయడు, ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... 50 ఏళ్ళ నుంచి తమ సతీమణి శ్రీమతి ఉషమ్మ సహకారంతో పాటు... వివిధ హోదాల్లో తనతో కలిసిన పనిచేసిన సిబ్బంది సహకారం, అంకితభావమే తన విజయాలకు కారణమని ఆయన పేర్కొనటం విశేషం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన ఎవరైనా సేవాభావంతో జీవితంలో ముందుకు సాగాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన తమ పూర్వ సిబ్బందికి అష్ట గుణాలను ఉద్బోధించారు. సమయపాలన, క్రమశిక్షణ, బృందస్ఫూర్తి, సేవాభావం, అంకితభావం, పరిపూర్ణ దృష్టి, నీతి, రీతి లాంటి ఎనిమిది గుణాలు జీవితంలో ఉన్నతిని అందిస్తాయని పేర్కొన్నారు. జీవితం మనల్ని ఏ మార్గంలో ముందుకు తీసుకుపోయినా సేవా భావాన్ని మాత్రం మరువకూడదని సూచించారు. ఈ సందర్భంగా వారందరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం దుస్తులు పెట్టి, ఆశీర్వచనం అందించారు. అనంతరం తెలుగువారి సంప్రదాయ వంటకాలతో వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి, అందరినీ పేరుపేరునా, ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారి మనుముడు, మనుమరాళ్ళు కలిసి వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో రూపకల్పన చేసిన యాప్, మరియు వెబ్ సైట్ ను ఆవిష్కరించి, పరిచయం చేశారు.
అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ...వెంకయ్యనాయుడు ప్రియశిష్యునిగా సాగించిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు దగ్గర పని చేస్తే, జీవితంలో ఏదైనా సాధించవచ్చని, ఆయన తర్ఫీదు అలా ఉంటుందని కొనియాడారు. తమ పిల్లలతో సమానంగా వెంకయ్యనాయుడు, వారి సతీమణి ఉషమ్మ అందించిన పుత్రవాత్సల్యం మరువలేనిదని, తనకు ఆరోగ్యం బాగాలేని సందర్భంలో వారు అండగా ఉన్న తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
జీవితంలో 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న అమృతోత్సవ సందర్భంలో గుర్తు పెట్టుకుని మరీ వెంకయ్యనాయుడు వ్యక్తిగత సిబ్బంది మొదలుకుని, ఉన్నత అధికారుల వరకూ అందరినీ పిలిచి, కుటుంబ సభ్యుల్లా ఆదరించి అభినందించటం పట్ల వారి వద్ద గతంలో పని చేసిన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వారి ప్రేరణతో సేవా భావాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఐ.ఏ.ఎస్ అధికారులు ఐ.విసుబ్బారావు, రజత్ భార్గవ్, కృష్ణ కిశోర్, సురేష్, యువరాజ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, రాజ్యసభలో సేవలు అందించిన రామాచార్యులు, ఏ.ఏ.రావు సహా... పలువురు ప్రభుత్వ అధికారులు, వెంకయ్యనాయుడు పూర్వ వ్యక్తిగత సిబ్బంది, ప్రస్తుత వ్యక్తిగత సిబ్బంది,నాయుడు కుటుంబ సభ్యలు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







