చి నుకు చూస్తే ...చెన్నపురికి కునుకు కరవైపోతోంది...
- May 17, 2016
చెన్నై: చి నుకు చూస్తే ...చెన్నపురికి కునుకు కరవైపోతోంది... మరో వాయుగుండం నగరాన్ని ముంచెత్తడానికి బంగళాఖాతంలో పొంచి చూస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో నగరంలో బీభత్సకాండ సృష్టించిన వర్షాల చేదు జ్ఞాపకాలను జనం ఇంకా మరచిపోలేదు. అంతలోనే మళ్లీ మరో వర్షగండం కాచుకుకూర్చుని ఉండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. గత రెండు నెలలుగా వేసవి ప్రతాపంతో అల్లాడిపోయిన జనం సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో కాస్త సేదతీరారు. అయితే ఈ వర్షం మామూలు వర్షం కాదని, వాయుగుండమై నగరానికి పెద్దగండంగా మారబోతుందని వాతావరణశాఖ మంగళవారం రాత్రి జారీచేసిన హెచ్చరికలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నగరంలో ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అధికారులు చేసిన హెచ్చరికలు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి నగరంలో భారీవర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ తెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షానికి పలు ప్రాంతాల్లో రహదార్లు జలమయమయ్యాయి. శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా బలపడింది. చెన్నై-పులికాట్ల మధ్య 230 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఏ క్షణమైనా తీరాన్ని దాటడానికి సిద్ధంగా ఉంది. దాంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వర్షం కుండపోతలా కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. చెన్నైలో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రహదార్లు జలమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.చెంబరంబాక్కంలో 17.7 సెంటీమీటర్లు గత ఏడాది వర్షాల సమయంలో చెన్నైని ముంచెత్తిన చెంబరంబాక్కం రిజర్వాయర్ ఇప్పుడు మరోసారి భయపెడుతోంది. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఈ ప్రాంతంలో భారీవర్షం కురిసింది. దాంతో జలాశయంలోని భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. చెంబరంబాక్కం ప్రాంతంలో 17.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత ఏడాది వర్షాల సమయంలో ఈ జలాశయం గేట్లను అర్ధరాత్రి ఎత్తేయడంతో అడయారు పొంగిపొర్లడం, దక్షిణ చెన్నైలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడం జనాల్ని భీతావహుల్ని చేశాయి. ఈ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడం కూడా అప్పట్లో పెనుదుమారం సృష్టించింది. దాంతో ఈసారి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ను నిశితంగా గమనిస్తోంది. జలాశయంలోకి వచ్చి చేరుతున్న నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. మరోవైపు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా విపత్తులు ఏర్పడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెన్నై శివార్లలోని రిజర్వాయర్ల వద్ద పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు అందాయి. వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే సూచనలుండటంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది.దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షం రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలు, దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువారూరు జిల్లా నన్నిలంలో సోమవారం ఉదయం ఏడు గంటలకు 14 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. తిరువారూరు, మదురై, తూత్తుకుడి, కడలూరు, కన్యాకుమారి తదితర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తీరప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. తిరువారూరులో 12 సెంటీమీటర్లు, కడలూరులో 10, కారైకుడిలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. కడలూరు, రామనాథపురం జిల్లాల్లో జాలర్లు చేపల వెళ్లకుండా పడవలను తీరాన్నే ఉంచేశారు. అక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దక్షిణాది జిల్లాల్లో పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









