బహ్రెయిన్ తెలుగు కళాసమితి రజతోత్సవ వేడుకల్లో వెంకయ్యనాయుడు
- September 16, 2023
బహ్రెయిన్: మాతృభాషలంటే మాట్లాడే పలుకులు మాత్రమే కాదని,గతం-వర్తమానం-భవిష్యత్తుల మధ్య తరాలను కలిపి ఉంచే వారధులని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఆవిర్భావ రజతోత్సవ వేడుకలకు శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, దేశపు ఎల్లలు దాటి తెలుగు భాషా, సంస్కృతులను కాపాడుకుని సగర్వంగా ముందు తరాలకు అందిస్తున్న ప్రవాసాంధ్రుల చొరవను అభినందించారు. ప్రవాసులను సాంస్కృతిక వారధులుగా అభివర్ణించిన ఆయన, బహ్రెయిన్ లో ఈ సంస్థ చేపడుతున్న సాంస్కృతిక, భాషా పరిరక్షణ, సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.

భాషా సంస్కృతులే మనిషిని సంఘటితంగా కట్టి ఉంచుతాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్న ప్రకృతి పరిరక్షణ,సాటి జీవుల పట్ల దయ, సమాజ ఉన్నతి పట్ల కృషి లాంటి విషయాలను తెలియజేశారు.భాషే మన సంస్కృతికి జీవనాడి అన్న ఆయన, భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తిమంతం అవుతాయని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ యవనికపై చాటుకునేందుకు విదేశాల్లోని తెలుగు వారు చొరవ తీసుకోవాలన్న ఆయన, ఇందు కోసం తెలుగు సాహిత్యాన్ని ఆయా దేశాల భాషల్లో అనువాదాలు చేయించే దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు.రవీంద్రుని గీతాంజలికి నోబెల్ బహుమతి అనువాదం కారణంగానే వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసిన ఆయన, అన్ని తెలుగు సంఘాలు సంఘటితంగా కదిలితే ఇది కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు.

మన భాష గొప్పతనాన్ని చాటేందుకు తెలుగు పద్యం, అవధానాలు చాలన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని, మన భాషలోనే నిక్షిప్తం చేశారని... ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించిన ఎవరికైనా అమ్మపాలు అందించినంత బలాన్ని, అమ్మ భాష అందించి తీరుతుందన్నారు.మాతృభాష అంటూ తెలుగు గురించే తాను మాట్లాడటం లేదని, ప్రపంచంలో ఏ భాష మాట్లాడే వారికైనా ఇది వర్తిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ తెలుగు ప్రజలతో పాటు బహ్రెయిన్ అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







