దుబాయ్‌ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత ప్రవాసులు

- December 01, 2023 , by Maagulf
దుబాయ్‌ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత ప్రవాసులు

దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దుబాయ్‌లో అడుగుపెట్టారు. యూఏఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న COP28 సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. విమానాశ్రయంలో యూఏఈ అంతర్గత మంత్రి, ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి ప్రపంచ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారని, వాతావరణ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ప్రధాని మోదీ హోటల్‌కు చేరుకోగానే యూఏఈలోని ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.  ‘మోదీ, మోదీ’, ‘అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసారు. ప్రధాని వారితో సంభాషించి, అభివాదం చేస్తూ వెళ్లారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీ నుండి వచ్చిన ఘనస్వాగతం తనను ఎంతో కదిలించిందని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "COP28 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌లో ల్యాండ్ అయ్యాను. మెరుగైన భూమండలాన్ని సృష్టించే లక్ష్యంతో జరిగే సమ్మిట్ కార్యకలాపాల కోసం ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని మోదీ X లో ట్వీట్ చేశారు.

వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది COP28 ఉన్నత-స్థాయి విభాగం. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి పలువురు ప్రపంచ దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాని మోదీ మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. COP28 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com