పాలకులు, ప్రజలు రామమార్గాన్ని అనుసరించాలి: వెంకయ్య నాయుడు
- January 22, 2024
హైదరాబాద్: పాలకులు, ప్రజలు అందరూ రామమార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆచిరకాలంలోనే భారత్ శక్తి సంపన్నమైన, సుసంపన్నమైన దేశంగా అవతరించాలంటే శ్రీరామ మార్గమే శరణ్యమని స్పష్టం చేశారు. రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలలో చేర్చాలని సూచించారు. సోమవారం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన శుభ సందర్భంలో హైదరాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి బంధుమిత్రుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఇతర భక్తులతో కలసి తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ " ఈరోజు ఎంతో పవిత్ర దినం. భారతీయ జీవన మూలం, పురుషోత్తముడు అయిన శ్రీరాముడి మందిరం అయోధ్యలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభించిన శుభ సందర్భంగా, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శుభ ఘడియల సందర్భంగా నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ మహాక్రతువులో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు. యావత్ దేశ ప్రజల చిరకాల కోరిక సాకారం కావడానికి కారకులైన లక్షల మంది కర సేవకులను, లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని ఈ దేశం మరవదు. ప్రతిక్షణం గుర్తుంచుకుంటుంది. వారి యాత్రలు మందిర నిర్మాణానికి దోహదం చేశాయి. సుప్రీంకోర్టులో అయోధ్య కేసును వాదించి గెలిపించిన న్యాయవాది పరాశరన్ ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ సంతోషకర సమయంలో దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు.
శ్రీరాముడు భారత సంస్కృతికి ప్రతీక అని వెంకయ్య నాయుడు చెప్పారు.
" శ్రీరాముడే మన అస్తిత్వం. మన జీవితంలోని ప్రతి అణువు, ప్రతి క్షణం శ్రీ రాముడే. మన మాటల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా శ్రీ రాముడే. మన పేర్లలోనూ శ్రీ రాముడే. శ్రీరాముడే మన సంస్కృతి. భారతదేశానికి రామ మార్గమే శరణ్యం. ఆ మంచి రోజు రానే వచ్చింది." అని అన్నారు.
ఆయన చూపిన బాటలో అందరం పయనించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శ్రీ రాముడు మత పురుషుడు కాదని, ఒక గొప్ప ఆదర్శ పురుషుడని స్పష్టం చేశారు. శ్రీ రాముడు భాషలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతుడని స్పష్టం చేశారు. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఆయన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆదర్శమంటే ఏమిటో ఆచరించి చూపించారని గుర్తు చేశారు. శ్రీరాముడి జీవితమంతా కష్టాల మయమే అయినప్పటికీ ఆయన ఎప్పుడూ సత్యనిష్ట,ధర్మ నిష్ట తప్పి వ్యవహరించలేదని గుర్తు చేశారు. పరిపాలకుడు అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపించారన్నారు. ఆకలి దప్పులు లేని, అరాచకాలకు- అవినీతికి తావులేని, సత్వర న్యాయం అందించే రాజ్యం శ్రీ రామరాజ్యమని, శ్రీ రాముడు అంత గొప్పగా పరిపాలించాడని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ భారత్ లో శ్రీ రామరాజ్యాన్ని స్వప్నించారన్నారు. పాలకులు, ప్రజలు ధర్మమార్గాన్ని అనుసరించినప్పుడే దేశం శక్తిమంతమవుతుందని స్పష్టం చేశారు.
"శ్రీ రాముడి ధర్మ నిరతి నాటికీ, ఏ నాటికీ అందరికీ ఆదర్శప్రాయమే. ఆయన పాటించిన ధర్మం కాలానికి అతీతమైనది. అందరూ అన్నివేళలా ఆచరించదగినది. ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించటం పాలకులు, ప్రజల కర్తవ్యం." అని చెప్పారు. " ధర్మమార్గాన్ని నేటి పిల్లలకు చక్కగా బోధించాలన్నా, చిన్ననాటి నుంచే విలువలు నేర్పించి వారి జీవనంలో భాగంగా చేయాలన్నా రామాయణ, మహాభారతాల వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలి. " అని స్పష్టం చేశారు.
అంతకుముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండువగా, వైభవంగా జరిగింది. రామయ్య కళ్యాణోత్సవానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ పూర్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికీ స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తాజా వార్తలు
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!









