దుబాయ్ లో పలు సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు

- January 22, 2024 , by Maagulf
దుబాయ్ లో పలు సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు

దుబాయ్: లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్​లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్ లతో సీఎం వరుసగా భేటీ అయ్యారు.హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్క్ లు, షాపింగ్ కాంప్లెక్స్​ ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. 

దుబాయ్‌ లో పలు సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి,  హైదరాబాద్ లో మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘చారిత్రాత్మక నగరాలన్నీనీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్‌ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది...’ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనా లు రూపొందించాలని కోరారు. ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.  
 
ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు ఈ సంప్రదింపులు కొనసాగించింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం హైదరాబాద్ కు చేరుకున్నారు. 

సీఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శేషాద్రి,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com