వాహనదారులకు గుడ్ న్యూస్..

- February 11, 2024 , by Maagulf
వాహనదారులకు గుడ్ న్యూస్..

న్యూ ఢిల్లీ: జాతీయ రహదారుల పై లాంగ్ డ్రైవ్ చేసే ఫోర్ వీలర్ వాహనదారులకు ఏర్పడుతున్న ప్రధాన సమస్య టోల్ గేట్ వద్ద ఆలస్యం. ఫాస్టాగ్ రూపంలో వారికి కాస్తంత ఉపశమనం దొరికినా.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాలతో టోల్ గేటులు రద్దీగా మారుతున్నాయి. 2018-19లో టోల్ ప్లాజా వద్ద వాహనాల సగటు వెయిటింగ్ టైం 8 నిమిషాలు. 2020-22 సంవత్సరంలో ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో వాహనాల సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది.

అయినా టోల్ గేట్‌ల వద్ద రద్దీ మాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రోజుల్లో హైవే టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గడ్కరీ ఆదివారం ప్రకటించారు. దేశంలోని పలు హైవేలపై వీటిని తొలుత అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.

ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమించిందన్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు, హైవేలపై ప్రయాణించే కచ్చితమైన దూరానికి వాహనదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ ఆదాయం ఏటా రూ. 40 వేల కోట్లు వస్తోందని, రానున్న 2-3 సంవత్సరాలలో రూ.1.40 లక్షల కోట్ల ఆదాయాన్ని టోల్ ద్వారా వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ అన్నారు.

దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌తో సహా కొత్త టెక్నాలజీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఆరు నెలల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 2021 నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరి చేయగా అది లేని వాహనాలు టోల్ రుసుమును రెండింతలు కట్టాలి. నగరాలకు సమీపంలో, జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణాలలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గినప్పటికీ, పీక్ అవర్స్‌లో టోల్ ప్లాజాల వద్ద చాలా ఆలస్యం జరుగుతోంది.

GPS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో హైవేలపై కెమెరా అమర్చుతారు. ఈ కెమెరాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను ఉంచుతారు. వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా ఇది టోల్‌ను కలెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం, FASTag ప్లాజాల్లో RFID ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com