ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

- April 07, 2024 , by Maagulf
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించే వారు. కానీ తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గతంలో నిత్య జీవితంలో కచ్చితంగా ఆచరించి ఆరోగ్యంగా ఉండేవారు. నేడు ఆధునిక పోకడలతో వాటిని విస్మరించి రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు.అయితే  ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా ఆరోగ్యాన్ని పొందడం కోసం మనకు మనమే కొన్ని చర్యలు చేపట్టవచ్చు. మరికొన్ని జాగ్రత్తలతో అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు.అందుకే ఆరోగ్యంపై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే ల‌క్ష్యంతో ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)నిర్వహించే అధికారిక ఆరోగ్య కార్యక్రమాల్లో 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' ఒకటి. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే (మార్చి 24), వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ (ఏప్రిల్ చివరి వారం), వరల్డ్ మలేరియా డే (ఏప్రిల్ 25), వరల్డ్ నో టొబాకో డే (మే 31), వరల్డ్ ఎయిడ్స్ డే (డిసెంబరు 1), బ్లడ్ డోనర్ డే (జూన్ 14), వరల్డ్ హెపటైటిస్ డే (జులై 28) నిర్వహిస్తున్నారు.

ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సరఫరా, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని 'ప్రపంచ ఆరోగ్యసంస్థ' పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారితీసే ప్రధాన అంశం మీద పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం, బరువు అదుపు, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవి చాలు. వ్యాయామం కూడా పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. చిన్న చిన్న మార్పులైనా చాలు. నెమ్మదిగా ఆరంభించినా చాలు. మంచి ప్రయోజనం కల్పిస్తుంది. క్రమంగా ఒక అలవాటుగా మారి, చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినం పరోక్షంగా ఇదే సూచిస్తోంది.

వైద్య సదుపాయాలు, చికిత్సల విషయంలో ఇవి అసమానతలకు దారి తీస్తుండొచ్చు. కానీ వ్యక్తిగత శ్రద్ధకు ఇవేవీ ఆంటకాలు కావు. డబ్బున్నా లేకున్నా, ఎవరైనా ఎక్కడైనా మంచి జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారిన పడకుండా హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యులు ఆరోగ్య అసమానతలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నారు,  ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రజలను ఒక చోటకు చేర్చే విధంగా ఈ వేడుక ప్రతి ఏడాది నిర్వహిస్తారు.  

                                       --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com