అసమాన దేశభక్తుడు

- April 08, 2024 , by Maagulf
అసమాన దేశభక్తుడు

భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరులు ప్రాణాలు అర్పించారు. అయితే దేశంలోకి ప్రవేశించి భారతీయులను బానిసలుగా మార్చిన బ్రిటిష్ వారికి తొలిసారిగా మొదటి స్వాతంత్ర సంగ్రామంగా పరిగణించే 1857లో కొందరు వీరులు ఎదురుతిరిగారు. ఆ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలలో ముఖ్యుడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే. నేడు పాండే వర్థంతి.

ఉత్తరప్రదేశ్ ‌(Uttar Pradesh)లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో మంగళ్ పాండే జన్మించారు. చిన్నతనంలోనే పాండే  శాస్త్రాధ్యయనం వద్దనుకొని శస్త్ర విద్యను అభ్యసించారు.  9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే బ్రిటీషు వారి సైన్యంలో చేరాడు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో (Bengal Native Infantry) రెజిమెంట్‌లో సిపాయిగా చేరి తన  ప్రతిభ, తెగువతో సైనిక రెజిమెంట్‌ దళానికి నాయకుడిగా పాండే ఎదిగారు.

ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు దారితీశాయి.

పాండే తన తోటి సిపాయిలను బ్రిటీష్ సామ్రాజ్య పాలనలో జరిగే దురాగతాలపై కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అప్పటిదాకా తెల్లవారు చేస్తున్న అన్ని అరాచకాలను మౌనంగా భరించిన భారతీయుల్లో మంగళ్ పాండే తిరుగుబాటుతో భారీ మార్పు వచ్చింది.మార్చి 29, 1857న ఉత్తర కోల్‌కతాలోని బరాక్‌పూర్‌లో మంగళ్ పాండే ఇద్దరు బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన తరువాత, పాండేపై విచారణ జరిగింది. ఆపై 1857 ఏప్రిల్ 8న  ఉరిశిక్షను విధించారు.

మంగళ్ పాండే మరణించినా ఆయన రగిలించిన తిరుగుబాటు స్ఫూర్తి వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వాతంత్రోద్యమం ప్రజ్వరిల్లింది.పాండే ప్రారంభించిన తిరుగుబాటును 1857 సిపాయిల తిరుగుబాటు అని, మొదటి స్వాతంత్ర యుద్ధం అని కూడా చరిత్రకారులు పిలుస్తారు.  

                                 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com