భారతీయల గుండెల్ని పిండేసిన సంఘటన

- April 13, 2024 , by Maagulf
భారతీయల గుండెల్ని పిండేసిన సంఘటన

జలియన్ వాలా బాగ్ మారణహోమం గురించి తెలియని వాడుండడు. అది గుర్తొచ్చినప్పుడల్లా కడుపుమండని భారతీయుడు కూడా ఉండదు. భారత స్వాతంత్ర చరిత్రలో అత్యంత విషాద దినం ఏప్రిల్ 13. బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులపై జరిపిన అత్యంత పాశవిక చర్య జలియన్ వాలా మారణకాండ.

జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ నగరంలోని ఓ తోట.పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండగ సందర్భంగా 1919 ఏప్రిల్ 13న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో ప్రజలు శాంతియుతంగా సమావేశమైన వేళ, అప్పటి పంజాబ్ లెఫ్టనెంట్ గవర్నర్ మేజర్ డయ్యర్ ఆ పార్కులో ఉన్నవారిపై ఎటువంటి హెచ్చరికలు జారీచేయకుండానే కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు.          

ఈ ఘటనలో 1000కి పైగా చనిపోగా.. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతదేహాల తరలింపును డయ్యర్  అడ్డుకోవడమేగాక చివరకు గాయపడినవారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.

1920లో హంటర్‌ కమిషన్‌ నివేదిక మాత్రం డయ్యర్‌ను, అప్పటి పంజాబ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇక, డయ్యర్‌ భారత్‌ విడిచి వెళ్లిపోయినా అతడ్ని దేశభక్తులు వదిలిపెట్టలేదు. మృత్యువులా వెంబడించి వేటాడి మట్టుబెట్టారు. 

సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్‌సింగ్‌ అనే దేశభక్తుడు లండన్‌ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్‌ను హతమార్చి జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు.ఈ సంఘటనలో మరణించిన అమరవీరుల గుర్తుగా 1961 ఏప్రిల్ 13న నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ లు  పూనుకొని  జలియన్ వాలా బాగ్ లో స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com