'పద్మవిభూషణ్' అవార్డు స్వీకరించిన వెంకయ్య నాయుడు

- April 22, 2024 , by Maagulf
\'పద్మవిభూషణ్\' అవార్డు స్వీకరించిన వెంకయ్య నాయుడు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంత్రం పద్మ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. తెలుగుజాతి గర్వించేలా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం "పద్మవిభూషణ్"ను వినమ్రంగా, సంతోషంగా స్వీకరించాను. రైతులు, మహిళలు, యువత సహా నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరికీ సగర్వంగా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్,నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామానికి చెందిన రైతుబిడ్డనైన నేను ఇంత గొప్ప గౌరవానికి అర్హుడను అవుతానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. గ్రామీణ నేపథ్యం నుంచి మొదలైన నా ప్రజా ప్రస్థానం అనేక సుదీర్ఘ పోరాటాలు, సవాళ్ళు, సమస్యల మధ్య సాగింది. ఈ గమనంలో ఎదురైన అనేక ప్రతికూలతలను, ఇబ్బందులను అధిగమించి భారతదేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతిగా దేశ ప్రజలకు సేవలు అందించటం భగవంతుని దయగా... నా జీవితపర్యంతం కట్టుబడిన నిబద్ధత, సిద్ధాంతాలకు లభించిన ప్రతిఫలంగా భావిస్తాను.

సమాజం పట్ల నిబద్ధత, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడి ఉండేందుకు నేను చేసిన వినమ్రపూర్వకమైన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ప్రతి అడుగులోనూ శక్తిని, ధైర్యాన్ని అందించిన భగవంతునికి ప్రణతులు అర్పిస్తూ, ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

చివరి శ్వాస వరకూ దేశ మాత సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న నా సంకల్పానికి ఈ పురస్కారం మరింత శక్తిని, విశ్వాసాన్ని అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com