నట ఖని.....సముద్రఖని

- April 26, 2024 , by Maagulf
నట ఖని.....సముద్రఖని

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సముద్రఖని.  నట దర్శకునిగా సాగుతున్న సముద్రఖని  అనేక తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. దర్శకునిగానూ తెలుగులో కొన్నిచిత్రాలు తెరకెక్కించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’, ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలతో సముద్రఖని నటునిగానూ తెలుగువారికి దగ్గరయ్యారు . 

సముద్రఖని1973 ఏప్రిల్ 26న తమిళనాట జన్మించారు. సొంతవూరు రాజపాలయంలో బి.యస్సీ, చదివి, మద్రాస్ లోని అంబేద్కర్ లా కాలేజ్ లో లా చేశారు. నటుడు కావాలని అప్పటి నుంచే తపించేవారు. తమిళ దర్శకుడు కె.విజయన్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు . తరువాత కె.బాలచందర్ నూరవ చిత్రం ‘పార్తలే పరవశమ్’ చిత్రానికీ అసోసియేట్ గా పనిచేశారు . 

బాలచందర్ రూపొందించిన మెగా సీరియల్ ‘అన్ని’కి కూడా పనిచేశారాయన. చిత్రసీమలో పలు పాట్లు పడ్డ తరువాత తాను కోరుకున్న విధంగా ‘ఉన్నై చరనదైందేన్’చిత్రంతో దర్శకుడయ్యారు . ఈ చిత్రాన్ని మన గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ నటించి, నిర్మించడం విశేషం! తరువాత విజయ్ కాంత్ హీరోగా ‘నెరంజ మనసు’ చిత్రానికి దర్శకత్వం వహించారు సముతిరకని. తెలుగులో పృథ్వీరాజ్ హీరోగా ‘నాలో’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆపై రవితేజ హీరోగా ‘శంభో శివ శంభో’ చిత్రాన్నీ తెలుగులో తెరకెక్కించారు. నాని హీరోగా ‘జెండాపై కపిరాజు’ సినిమాను కూడా రూపొందించారు. అల్లరి నరేశ్ తో ‘సంఘర్షణ’ అనే చిత్రాన్నీ తీశారాయన. దర్శకునిగా నాలుగు తెలుగు సినిమాలు రూపొందించినా, లభించని గుర్తింపు నటునిగా ఇట్టే సంపాదించేశారు. ఆయన నటించిన అనేక అనువాద చిత్రాల్లోనూ నటనతో ఆకట్టుకున్నారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి తపిస్తారు. అదే రీతిన వైవిధ్యమైన అంశాలు తట్టినప్పుడే కథలు రాసి, సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. తెరపై విలక్షణమైన పాత్రల్లో కనిపించే సముతిరకని, దర్శకునిగా వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ ఉంటారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. 

                            --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com