సినిమా రివ్యూ: ‘ఆ ఒక్కటీ అడక్కు’.!

- May 03, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఆ ఒక్కటీ అడక్కు’.!

అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కామెడీ హీరోనే. మినిమమ్ గ్యారంటీ హీరో. ఖచ్చితంగా ఆయన సినిమాలకు పైసా వసూల్ టికెట్ అనే ఇమేజ్ వుంది. అయితే ఆ ఇమేజ్‌కి కాస్త డ్యామేజ్ రావడంతో.. కామెడీ జోనర్ వదిలేసి సీరియస్ టోన్‌లో సినిమాలు చేసుకుంటూ వచ్చాడాయన. అలా వచ్చిన సినిమాలే ‘ఉగ్రం’, ‘నాంది’, ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ తదితర సినిమాలు. అయితే, చాన్నాళ్ల తర్వాత అల్లరి నరేష్ నుంచి  వచ్చిన ఓ ఫ్యామిలీ జోనర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. పెద్దగా అంచనాల్లేకపోయినా ఈ సినిమాకి రిలీజ్ ముందు పాజిటివ్ నోట్ కనిపించింది. మరి, ఆ పాజిటివిటీని ఈ సినిమా ఎంతమేర క్యాష్ చేసుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
గణపతి అలియాస్ (గణ) సబ్ రిజిస్టార్ ఆఫీసులో పని చేస్తుంటాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. తనకు వయసు ఎక్కువైందనో, తమ్ముడికి తన కన్నా ముందే పెళ్లయిపోయిందన్న వంక.. ఇలా రకరకాల కారణాలతో గణకి వస్తున్న సంబంధాలన్నీ చెడిపోతుంటాయ్. తన చేతుల మీదుగా వందల పెళ్లిళ్లు చేసిన గణకి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సెట్ కాదు. తమ్ముడు (రవికృష్ణ)కి మేనమామ కూతురు దేవి (జామీ లివర్)తో పెళ్లయిపోయింది. వాళ్లకి ఓ పాప కూడా. ఇంకా పెళ్లవ్వలేదా.? అన్న ప్రశ్నలతో రోజూ సతమతమవుతుంటాడు గణ. ఈ నేపథ్యంలో ఓ మ్యాట్రిమొనీ సంస్థలో ప్లాటినం మెంబర్‌గా జాయిన్ అవుతాడు. అలా సిద్ది (ఫరియా అబ్ధుల్లా)తో పరిచయం ఏర్పుడుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు గణ. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ మ్యాట్రిమొనీ ఫేక్ అనీ, అలా పరిచయమైన సిద్ది ఫేక్ ఫెళ్లికూతురనీ తెలుసుకున్న గణ ఏం చేశాడు.? చివరికి గణ పెళ్లి, సిద్దితో అయ్యిందా.? సిద్ది గురించి నిజం తెలుసుకున్న గణ ఏం చేశాడు.? పెళ్లి కాని కుర్రోళ్లని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తూ బిజినెస్ చేస్తున్న ఆ మ్యాట్రిమొనీ ఆట గణ ఎలా కట్టించాడు.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
చాలా కాలం తర్వాత అల్లరి నరేష్‌ని చాలా ప్లెజెంట్‌గా తెరపై చూసిన ఫీలింగ్ బాగుంది. అన్నీ సక్రమంగా వుండి వెల్ సెటిల్ అయినప్పటికీ పెళ్లి కాక, ఎన్నో స్ర్టగుల్స్ పడుతున్న గణ పాత్రలో అల్లరి నరేష్ చాలా ఈజీగా ఒదిగిపోయాడు. హీరోయిన్ ఫరియా అబ్ధుల్లాకి ఇదో మంచి ఛాన్స్ అనే చెప్పాలి. అల్లరి నరేష్ పక్కన పెయిర్ బాగా సెట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్‌లో చలాకీగా, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లలోనూ తనదైన పర్‌పామెన్స్‌తో ఆకట్టుకుంది. స్ర్కీన్‌పై ఆమె కటౌట్ అందంగా కనిపించింది. ప్రముఖ కమెడియన్ జానీ లివర్ ముద్దుల తనయ అయిన జామీ లివర్ ఈ సినిమాలో అల్లరి నరేష్‌కి మరదలి పాత్రలో నటించింది. ఆమె పాత్రకు చాలా స్కోప్ వుంది. ఆ స్కోపులో ఆమె పండించిన కామెడీ బాగానే వున్నప్పటికీ చాలా ఓవరయ్యిందన్న ప్రేక్షకుల రెస్పాన్స్ కష్టమైంది. వెన్నెల కిషోర్, హీరోకి సపోర్టింగ్ రోల్‌లో తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఫ్రెండ్‌ రోల్‌లో అరియానా నటన తనకున్న స్ర్కీన్ స్పేస్‌లో బాగుంది. హర్ష చెముడు, మురళ్లీ కృష్ణ, రవికృష్ణ అజయ్, మురళీ శర్మ, గెస్ట్ రోల్ చేసిన షకలక శంకర్  తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు మల్లి అంకం మంచి కథనే ఎంచుకున్నాడు. గతంలో ఈ తరహా కథలు అనేకం వచ్చినప్పటికీ మ్యాట్రిమొనీ పెళ్లిళ్ల కంపెనీ జనాల్ని ఎలా మోసం చేస్తుంది.? పెళ్లి కాని కుర్రాళ్ల సెంటిమెంట్‌తో ఎలా ఆటలాడుకుంటుంది.? ఈ బిజినెస్ వెనక దాగున్న మోసం ఎంత ప్రమాదకరమైనది.? ఇలాంటి పలు అంశాల్ని కథనంగా ఎంచుకుని తనకున్న సోర్సెస్‌లో కామెడీ దట్టించి బాగానే డీల్ చేశాడు. అయితే ద్వితీయార్ధంలో కాస్త కామెడీ డోస్ మిస్ అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అబ్బూరి రవి మాటలు బాగానే వున్నాయ్. గోపీసుందర్ మ్యూజిక్ మరీ వినసొంపుగా వుందని చెప్పలేం కానీ, విజువల్‌గా చాలా బాగున్నాయ్. సూర్య సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో ఇంకాస్త కత్తెర పదునుంటే బాగుండేది సెకండాఫ్‌లో. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
అల్లరి నరేష్ పర్‌ఫామెన్స్, విజువల్‌గా ప్లెజెంట్‌గా అనిపించిన సాంగ్స్, అల్లరి నరేష్, ఫరియా అబ్ధుల్లా జంట కొత్తగా వుంది. ఇంటర్వెల్‌లో హీరోయిన్ ట్విస్ట్..

మైనస్ పాయింట్స్:
జానీ లివర్ కూతురు అయిన జామీ లివర్‌తో అల్లరి నరేష్ మరదలు పాత్ర చేయించడం చాలా మైనస్ పాయింట్ సినిమాకి. ఆమె వరకూ ఆమె చాలా బాగా నటించినప్పటికీ ఆ పాత్రను మన తెలుగు ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ పాత్రలో హరితేజను కానీ, శ్యామల, సత్య ఇంకా చాలా మంది మన తెలుగు ప్రేక్షకులకి అలవాటైన అక్క, వదినల పాత్రలను చూజ్ చేసుకుని వుంటే బాగుండేది. జామీ లివర్ పాత్రను తట్టుకోవడమే పెద్ద సహన పరీక్ష అయ్యింది.

చివరిగా:
‘ఆ ఒక్కటీ అడక్కు’ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.! హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఓ సారి చూసేయదగ్గ నవ్వుల హంగామానే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com