ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- May 19, 2024హైదరాబాద్: ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ. పైగా ఆరు గ్యారంటీలకు నిధుల కొరత. ఇప్పుడేం చేద్దాం… సీఎం రేవంత్ సర్కార్‌ను కలవరపెడుతున్న సమస్య ఇదే… ప్రభుత్వ ఆదాయం, ఆదాయ వనరులను పెంచుకోవడమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం ప్రభుత్వం ఏం చేయనుంది? రాబడి పెంచుకునే మార్గాలేంటి?
సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. గత ఏడాదిలో 2 లక్షల 16 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, కేవలం లక్ష 69 వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయం లక్ష 52 వేల కోట్లు కాగా, కేవలం లక్ష 35 వేల కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి.
ఇక ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 49 వేల 440 కోట్ల రూపాయలు రుణాలు కింద చెల్లించాల్సి ఉంది. ఇలా వచ్చిన ఆదాయంలో మూడో వంతు రుణాల వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సిరావడం ప్రభుత్వానికి మరింత భారంగా మారిందంటున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రణాళికేతర రుణాల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలుగా మారిందని అంటున్నారు ఆర్థికవేత్తలు.
భారం దాదాపు 53 వేల 196 కోట్లు
ఇక అధికారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీల భారం దాదాపు 53 వేల 196 కోట్లు. మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు నెలకు 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, 500లకే వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చు అదనమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడం ఒక్కటే మార్గమని రేవంత్ సర్కార్ అభిప్రాయపడుతోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలతోపాటు, గత ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన రైతు రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవాలంటే ఆదాయం పెంచుకోక తప్పనిసరి పరిస్థితి. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూముల విక్రయించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇదే సమయంలో భూముల విలువ పెంచి రిజిస్ర్టేషన్ ఆదాయం పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో హైదరాబాద్ నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోనూ భూముల మార్కెట్ ధరకు ప్రభుత్వ విలువకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతిఏటా భూముల మార్కెట్ విలువను సవరించాలి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల వరకు భూముల విలువ పెంచలేదు. 2021 జులైలో ఒకసారి, 2022 ఫిబ్రవరిలో రెండోసారి భూముల విలవను పెంచింది అప్పటి సర్కార్. అయినప్పటికీ మార్కెట్ రేట్‌కు ప్రభుత్వ విలువకు మధ్య భారీ అంతరం ఉంది. దీంతో భూముల విలువలను సవరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆదాయం అనుకున్నంత మేర రాలేదు
గత ఏడాది మద్యం విక్రయాలు అధికంగా పెరిగినా, ఎక్సైజ్ ఆదాయం అనుకున్నంత మేర రాలేదు. మద్యం స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారుల వల్ల ఎక్సైజ్ ఆదాయానికి గండి పడిందని గ్రహించింది ప్రభుత్వం. దీంతో మద్యం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు తెలంగాణలో జీఎస్టీ ఎగవేతపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. పన్నుల రాబడిని పెంచి లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
ఇక ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా అరికట్టాల్సివుంది. దీనిపైనా సీరియస్‌గా దృష్టి పెట్టారు సీఎం. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షిస్తానని తేల్చిచెప్పారు సీఎం… దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు ప్రభుత్వ ఆదాయం కూడా రేవంత్ సర్కార్ ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా మారిందని అంటున్నారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము