జర్నలిస్టుల మార్గదర్శి...పొత్తూరు

- May 26, 2024 , by Maagulf
జర్నలిస్టుల మార్గదర్శి...పొత్తూరు

తెలుగు ప్రత్రికారంగంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి తర్వాత తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రముఖ జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో సహృదయత, నిరాడంబరత, మానవతా విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి కోసం పోరాడే మనస్తత్వం గల వ్యక్తి దిగ్గజ జర్నలిస్ట్ పొత్తూరు పుల్లయ్య.

పొత్తూరు పుల్లయ్య ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా కొట్టాలపల్లి గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన చిన్నరంగప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించారు. హైస్కూలు వరకు ఉరవకొండలో  సాగింది. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో పి.యూ.సి, డిగ్రీ పూర్తి చేసి మద్రాస్ లోని ప్రముఖ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం. ఏ తో పాటు ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.

పుల్లయ్య చిన్నతనం నుంచే అన్యాయాలపై తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వ్యక్తి. తమ ప్రాంతంలో భూస్వామ్య శక్తులు పేద ప్రజలను దోచుకున్న తీరును నిరసిస్తూ జరిగిన ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిన సందర్భాలు అనేకం. పేద ప్రజల పోరాడేందుకు న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. అయితే, న్యాయవాదిగా ఉన్నప్పటికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడేందుకు జర్నలిజాన్ని ఎంచుకున్నారు.

నాటి ప్రఖ్యాత జర్నలిస్టు దిగ్గజం నార్ల వెంకటేశ్వరరావు సంపాదకుడిగా ఉన్న ఆంధ్రప్రభ పత్రికలో చేరారు. నార్ల వారి శిష్యరికంలో ఉత్తమ విలువల గల జర్నలిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఆనాటి నుండి రిటైర్మెంట్ తీసుకునే వరకు ఆయన ఆ పత్రికలోనే చీఫ్ రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్ గా, న్యూస్ ఎడిటర్‌గా, రెసిడెంట్ ఎడిటర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

పుల్లయ్య గారి నాయకత్వంలోనే బెంగుళూరు కేంద్రంగా ఆంధ్రప్రభ పత్రిక వెలువడింది. రెసిడెంట్ ఎడిటర్‌గా ఆంధ్రప్రభ పత్రిక  విస్తరణ భాద్యతలు స్వీకరించి పత్రికను పాఠకులకు చేరువ చేయడానికి  వీరు చూపిన  చొరవ , ధీటైన నాయకత్వ లక్షణాలు విశేషంగా చెప్పుకోవచ్చు. బెంగుళూరు నుంచే వెలువడే ఆంధ్రప్రభలో రాయలసీమ సమస్యలకు సంబంధించిన వార్తలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రచురించారు. ఆంధ్రప్రభ యజమాని రామ్ నాథ్ గోయెంకాను ఒప్పించి ఆంధ్రప్రభ కు అనుబంధంగా విజ్ఞానప్రభ, సాహిత్యప్రభ, క్రీడాప్రభల పేరుతో ప్రత్యేక సంచికలను తీసుకొచ్చారు. ఆయన నేతృత్వంలో వెలువడిన ఈ సంచికలకు తెలుగు నాట విశేషమైన ఆదరణ లభించింది.

ఆంధ్రప్రభలో పదవి విరమణ తరువాత ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రతి వారం "షేర్ సింగ్" పేరుతో ఆయన వ్రాసిన ప్రత్యేక బిజినెస్,షేర్  మార్కెట్ వ్యాసాలు షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగిన వారికి ఎంతో విజ్ఞానదాయకంగా వుండేవి. ఇంగ్లీష్ పత్రికలలో వెలువడే నిపుణుల వ్యాసాలతో పోల్చదగినవిగా వుండేవి. షేర్ మార్కెట్ గురించి తెలుగులో విశ్లేషణాత్మక రచనలు సాగించిన తొలి కాలమిస్టు. ఆయన షేర్ మార్కెట్ వ్యాసాలు నేటి చాలా మంది బిజినెస్ జర్నలిస్టులకు అదర్శమయ్యాయి.

ఆంధ్రప్రభ పత్రిక న్యూస్ ఎడిటర్ గా విజయవాడలో పనిచేస్తున్న సమయంలోనే విజయవాడ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సంస్థ  కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు. నేడు దేశంలో ఉన్న అత్యుత్తమ ప్రెస్ క్లబ్ లలో విజయవాడ ప్రెస్  క్లబ్ ఒకటి.

ప్రతి జర్నలిస్టుకూ జ్ఞానంతో పాటు వ్యక్తిత్వం, తనకంటూ ప్రత్యేక శైలి ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా ఎందరో యువ ప్రతిభావంతుల్ని ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. పెద్దగా జ్ఞానబోధనలేవి చెయ్యకుండానే మన దగ్గర పనిచేసే వారిని కొంచెం మోటివేట్ చేయగలిగితే చాలని అంటుండేవారు. ప్రముఖ జర్నలిస్టులు వాసుదేవ దీక్షితులు, టి.పి.విఠల్, ఐ .వెంకట్రావు ,కె. రామచంద్రమూర్తి మరియు ప్రస్తుత ఆంధ్రజ్యోతి సంస్థల  అధినేత వేమూరి రాధాకృష్ణ గార్లు మరియు ఎందరో జర్నలిస్టులు పుల్లయ్య మార్గదర్శనంలో  ఎదిగినవారే.

కులమతాభిమానాలు పత్రికారంగాన్ని ప్రభావితం చేయకూడదనే ఆలోచనతో , ఆ ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించి , సమగ్ర నిజాయితీలతో ప్రతిభావంతులైన యువ పాత్రికేయులను ప్రోత్సహించిన పుల్లయ్య గారిని పత్రికా రంగం ఎన్నటికీ మారిచిపొదు. పుల్లయ్య భౌతికంగా లేకపోయిన నిబద్దత కలిగిన జర్నలిజం కోసం, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషిని పత్రికా ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుంది. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com