ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..

- May 31, 2024 , by Maagulf
ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..

అమరావతి: భారత దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారత దేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) శుక్రవారం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. మండలంలో నేడు వడగాలులతో పాటు 45.1°C ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మండల వాసులంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిన్న విజయవాడ అర్బన్‌లో 43.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం రామరాయి గ్రామ వ్యవసాయ పొలాల్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు పలాస మండలం సున్నాడ గ్రామానికి చెందిన కుమ్మరి గణపతి(30)గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com