సినిమా రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

- May 31, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఏకంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్యనే వాడేశాడు మాస్ కా దాస్. ప్రమోషన్లు విశ్వక్ రేంజ్‌లో బాగానే జరిగాయ్. బోలెడన్ని వాయిదాల అలాగే అంచనాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఎలా వుందో తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్ సేన్) ఓ అనాధ. గోదావరి ప్రాంతంలోని లంకల్లో సాధారణ జీవితం గడుపుతూ ఆకాశాన్నందుకునే కలలు కంటుంటాడు. అలా గొప్పోడవ్వాలంటే సిగ్గొదిలేయాలి.. అనే నినాదంతో తప్పులు మోసాలు చేసయినా సరే పెద్ద స్థాయికి ఎదగాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ పెద్ద దొంగతనం చేసి డీలర్ షిప్ సంపాదిస్తాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) దగ్గర నమ్మిన బంటుగా చేరతాడు. ఈ క్రమంలోనే దొరస్వామికి ప్రత్యర్ధి అయిన నానాజీ (నాజర్) ముద్దుల కూతురు బుజ్జి (నేహా శెట్టి) తో లవ్‌లో పడి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నానాజీ సాయంతోనే తాను నమ్మకంగా వున్న దొరస్వామికే ఎధురు తిరిగి అతనిపై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. అలా సాధారణ స్థాయి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన రత్న జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.? అధికారం చేపట్టాకా రత్న ఏం చేశాడు.? ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.? చివరికి రత్న జీవితానికి ముగింపు ఎలా వచ్చింది.? తెలియాలంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు:
విశ్వక్ సేన్ ఇంతవరకూ చేసిన పాత్రలన్నింటీకీ భిన్నంగా వుంది ఈ సినిమాలో రత్నాకర్ పాత్ర. ఆ పాత్రను చాలా బాగా డీల్ చేశాడు విశ్వక్ సేన్. ప్రాణం పెట్టేశాడు. కొన్ని యాక్షన్ సీన్లలో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్లలోనూ కట్టిపడేశాడు. హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో సహజంగా కనిపించింది. అందంగా కనిపిస్తూనే కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్లలోనూ కేక పుట్టించింది. మరో కీలక పాత్రధార అంజలి.. సర్‌ప్రైజింగ్ రోల్ పోషించింది. రత్నమాల అనే వేశ్య పాత్రలో విశ్వక్ సేన్‌‌కి ధీటుగా నటించింది. తనదైన అనుభవం రంగరించి ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గోపరాజు రమణ ఇంతవరకూ చిన్న చిన్న కామెడీ విలన్ రోల్స్ పోషించాడు. కానీ, ఈ సినిమాలో మెయిన్ లీడ్ విలన్‌గా వందకు వంద మార్కులు వేయించుకున్నాడు. నాజల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఆయన తన అనుభవం చూపించారా పాత్రలో. హీరో పక్కనే వుండే పాత్రలో ఆది తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కృష్ణ చైతన్య మరోసారి తనదైన పనితనం చూపించాడు ఈ సినిమాతో. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది కృష్ణ చైతన్యకు. మాటల్లో పదును చూపించాడు. ఓ కింది స్థాయి వ్యక్తి ఎలా ఉన్నత స్థానానికి ఎదిగాడు.? అనే కథాంశం కొత్తదేమీ కాదు.. కానీ, ఆ కథను తెలివిగా నడిపించడంలో కృస్ణ చైతన్య సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్లలో హీరోని ఎలివేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్‌లో వచ్చే యాక్షన్ బ్లాక్ సినిమాకి హైలైట్. అలాగే యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ సినిమాని విజయవంతంగా నడిపించడంలో బాగా సాయపడింది. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా కథలో లీనమైపోయేలా చేస్తాయ్. సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపించింది. గోదావరి, లంకల బ్యాక్ డ్రాప్‌ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కా..స్త సాగతీతగా అనిపిస్తాయ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు విశ్వక్ సేన్ స్థాయికి మించి వున్నాయ్. ఓవరాల్‌గా ఈ సినిమాకి టెక్నికల్ వర్క్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్ పర్‌పామెన్స్, మేకోవర్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఎలివేషన్లు.. ఆధ్యంతం వినోదాత్మకంగా అలాగే, ఆసక్తికరంగా ఉత్సాహంగా సాగే ప్రధమార్ధం..

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం, కాస్త సాగతీతగా అనిపించిన సెకండ్ హాఫ్,

చివరిగా:
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిచ్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కొత్తగా అనిపించిన విజువల్స్ కోసం ఒకసారి ధియేటర్లలో చూడొచ్చు. బోర్ ఫీలవ్వరు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com