నటశేఖరుడు..!
- May 31, 2024
తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజ్రుంభించి నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఆనాడు హేమహేమీలైన ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి అంచలంచలుగా సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన సెల్యులాయిడ్ కర్షకుడు, సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ. నేడు టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ 82వ జయంతి. ఈ సందర్భంగా ఈ మేరునగధీరుడి సాహస ప్రస్థానం గురించి కొన్ని విషయాలు...
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1943,మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామంలోని పెద్ద రైతు కుటుంబానికి చెందిన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతుల పెద్ద కొడుకుగా కృష్ణ జన్మించారు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదగాలని నిర్ణయించుకున్నారు.
నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిసారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో ‘ఛైర్మన్’ వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు. అనంతరం మద్రాస్ వెళ్లి తనలాగే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న శోభన్‌బాబుతో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు.
జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో కృష్ణ చిన్నపాత్ర పోషించారు. ఒకసారి కొడవటిగంటి కుటుంబరావుతో పాండీ బజార్లో వున్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో వున్న దర్శకనిర్మాత శ్రీధర్ చూసి, ‘కాదలిక్కనేరమిల్లై’ (తెలుగులో ‘ప్రేమించిచూడు’)లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకుంటే, తమిళ భాష రాని కృష్ణకు ఆ అవకాశం చేజారి రవిచంద్రన్‌కి దక్కింది. తర్వాత కృష్ణ ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత
1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఫొటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని కూడా తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చినా వారెవరూ ఎంపిక కాలేదు. కృష్ణ అదృష్టవంతుడని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.
ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చెయడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం ‘తేనెమనసులు’ కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ఈ సినిమాలో కృష్ణ సరసన సుకన్య, రామ్మోహన్ సరసన సంధ్యారాణి నటించగా, 31 మార్చి 1965న సినిమా విడుదలై వంద రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణకి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది.
ఈ లోగా ఆదుర్తి కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం కృష్ణతో ‘కన్నెమనసులు’ ప్రారంభమైంది. అదే టైమ్‌లో బాండ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ డూండేశ్వరరావు ‘గూఢచారి116’ సినిమా కోసం కృష్ణకు ఆఫర్ ఇస్తూ ఆదుర్తిని సంప్రదించారు. ఆదుర్తి దీవెనలతో ఆ యాక్షన్ చిత్ర అగ్రిమెంటుపై కృష్ణ సంతకం పెట్టి నటించారు. ‘కన్నెమనసులు’ జులై 22, 1966న విడుదలైతే, ‘గూఢచారి116’ ఆగస్టు 11, 1966న విడుదలై, తొలి స్పై పిక్చర్ కావడంతో దుమ్ము రేపింది.
‘కన్నెమనసులు’ యావరేజిగా ఆడింది. ఈ సినిమా తర్వాత కృష్ణ డూండీతో 25 సినిమాల దాకా చేశారు. ‘తేనెమనసులు’ చిత్రానికి కృష్ణ అందుకున్న తొలి పారితోషికం రెండు వేలు. ‘గూఢచారి116’ తర్వాత కృష్ణని అందరూ ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’ అని పిలవటం మొదలెట్టారు. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాల్లో బుక్ అయ్యారు. ఆరోజుల్లో ఇది చాలా పెద్ద రికార్డ్.
‘తేనెమనసులు’ సినిమా ద్వారా డైలాగులు చెప్పడం, డ్యాన్సు చెయ్యడం, స్కూటరు, కారు నడపటం, హావభావాలు చక్కగా పలకటం నేర్చుకుంటే, ‘కన్నెమనసులు’ చిత్రం ద్వారా ఈత కొట్టటం, గుర్రపుస్వారీ చెయ్యడం, ఫోక్ డ్యాన్స్ చెయ్యడం నేర్చుకున్నారు కృష్ణ. ఇక ‘గూఢచారి116’లో స్పీడ్ యాక్షన్ మూవ్‌మెంట్లు, తుపాకీ వాడటం, ఫైటింగులు చెయ్యడం అలవడింది. ‘గూఢచారి 116’ విడుదలైన 100వ రోజు ఉదయాన విఠలాచార్య సినిమా కృష్ణ తలుపు తట్టింది. ‘ఇద్దరు మొనగాళ్ళు’ అనే జానపద సినిమా అది. కాంతారావుతోబాటు, ‘తేనెమనసులు’ సహనటులు సంధ్యారాణి, సుకన్యలతో కలిసి నటించిన ఈ చిత్రంలో చాలా భాగం కృష్ణకి మాటలే వుండవు.
1967లో ఈ సినిమాతో కలిసి ఏకంగా ఆరు సినిమాల్లో కృష్ణ నటించారు. వీటిలో చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్‌డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజ్‌ని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే.1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి.వాటిలో మూడు చిత్రాలు విజయనిర్మలతో నటించినవి.
కృష్ణకు మంచి విజయాలు సాధించిపెట్టిన మరో జానర్ - క్రైమ్ సినిమాలు. 1968-1970 మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసినా 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ దశ మార్చింది. దీని తర్వాత రెండేళ్ళలో కృష్ణ నటించిన ఎనిమిది క్రైమ్ చిత్రాలు విడుదలయ్యాయంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.
1970లో పద్మాలయ సంస్థ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ చిత్రాన్ని నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంటే కృష్ణ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లో నటించేవారు. 1971లో కృష్ణ రెండో సొంత చ్తిరం ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. తెలుగులో ఇది తొలి సినిమాస్కోప్ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ సినిమా సింహభాగాన్ని రాజస్థాన్ అడవుల్లో, హిమాచల్‌ప్రదేశ్‌లో తీసారు. ఈ చిత్రంలో కృష్ణని అభిమానులు కౌబాయ్‌గా చూసుకున్నారు. ఈ సినిమా ఖ్యాతి దేశవిదేశాలకు విస్తరించింది. ‘ది ట్రెజర్ ఐలాండ్’ పేరుతో ఇంగ్లిషులోకి అనువదించిన ఈ సినిమాని 125 దేశాల్లో ప్రదర్శించారు.
చిత్ర పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడైన నటుడు ప్రభాకర్‌రెడ్డిని భాగస్తుడిగా చేసుకొని 1972లో 60 వేల అడుగుల నిడివిగల ‘పండంటి కాపురం’ సినిమాని కేవలం 45 రోజుల్లో నిర్మించి, క్లైమాక్స్ దృశ్యాల్ని బందరులో అశేష జనవాహిని మధ్య చిత్రీకరించి కృష్ణ రికార్డు సృష్టించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడమే కాదు. ఇందులో ప్రతినాయక ఛాయలు కలిగిన పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ జమునకు ‘రాణీ మాలినీ దేవి’గా గుర్తింపుతెచ్చి పెట్టింది.
1973లోనే కృష్ణ, విజయనిర్మల కలిసి విజయకృష్ణా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి విజయనిర్మల దర్శకురాలిగా తొలి సినిమా మలయాళంలోనూ, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయనిర్మల తెలుగులో కృష్ణ, తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా - మంచి విజయాన్ని సాధించింది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాలకల్లా కృష్ణ వంద సినిమాలు పూర్తిచేసుకున్నారు.
1974లో కృష్ణ 100వ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘అసాధ్యుడు’ చిత్రంలో కొద్దీ క్షణాలు సీతారామరాజుగా కనిపించిన కృష్ణకు, ఆ కథను చిత్రంగా తీయాలనే అభిలాష కలిగింది. స్వాతంత్య్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన వీరాభిమన్యునిగా, స్వేచ్ఛా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదుల్లే గజగజలాడించిన విప్లవ ప్రవక్తగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్ చిత్రంలో తీర్చిదిద్దారు కృష్ణ. భారీ బడ్జెట్ సినిమాలను 13 లక్షల్లో తీయ్యగలిగే ఆ రోజుల్లోనే, కృష్ణ ఈ సినిమాకు 25 లక్షలు ఖర్చు చేశాడు. సినిమా విజయవంతమై మంచి లాభాలను ఆర్చించింది.
అల్లూరి సీతారామరాజు భారీ విజయాన్ని అందుకున్నాకా 1974లోనూ, 1975లోనూ కృష్ణ కథానాయకుడిగా విడుదలైన పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందే చూసిన చక్రపాణి, సినిమా చాలా బాగా వచ్చిందనీ, ఇంతటి మహోన్నతమైన పాత్రలో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రల్లో చూసి కృష్ణని అంగీకరించలేరనీ, అలా ఓ పది సినిమాల వరకూ ఫ్లాపవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది. అలా అల్లూరి సీతారామరాజు ప్రభంజనంలో కొట్టుకుపోయిన సినిమాల్లో విజయనిర్మల దర్శకురాలిగా కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రల్లో తీసిన దేవదాసు సినిమా ఒకటి.
పౌరాణికాల్లో నందమూరి తారక రామారావు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు, జానపదాల్లో కాంతారావు అప్పటికే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లో అడుగుపెట్టిన కృష్ణ 1975 నాటికల్లా అగ్ర కథానాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ (స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, దేవుడు చేసిన మనుషులు,విచిత్ర కుటుంబం), నాగేశ్వరరావు (అక్కా చెల్లెలు, మంచి కుటుంబం)లు సహా పలువురు తోటి హీరోలతో అనేక మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. కృష్ణ యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపథాన్ని చేరుకుంటున్నా సమాంతరంగా ఉండమ్మా బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కిష్టయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు లాంటి కుటుంబ కథా చిత్రాలు కూడా చేశారు.
1978-1985 మధ్యకాలం కృష్ణ కెరీర్‌లో ఉచ్ఛదశ నడిచింది. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేశాడు. 1977 నుంచి పదేళ్ళు లెక్క వేసుకున్నా హీరోగా మరో 117 సినిమాల్లో నటించారు. 1977 నుంచి 1989 మధ్య కాలంలో యాక్షన్ చిత్రాల దర్శకత్వంలో పెద్ద పేరు పొందిన కె.ఎస్.ఆర్.దాస్ కాంబినేషన్‌లోనే 20 సినిమాల్లో నటించాడు. ఆ కాలంలోనే మరో 20 పైచిలుకు సినిమాలు విజయనిర్మల దర్శకత్వంలో చేశారు.
యాక్షన్ హీరోగా తనకున్న ఇమేజిని కొనసాగిస్తూనే కుటుంబ కథా చిత్రాల్లోనూ కృష్ణ నటించారు. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (హేమాహేమీలు,గురు శిష్యులు) తోటి హీరోలు శోభన్‌బాబు (కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు), కృష్ణంరాజు (మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, విశ్వనాధ నాయకుడు) అప్పుడప్పుడే ఎదుగుతున్న రజినీకాంత్ (అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్), మోహన్ బాబు (ముగ్గురూ ముగ్గురే) వంటి వారందరితోనూ అనేక మల్టీస్టారర్ సినిమాలు చేయడం కొనసాగించారు. ఎన్టీ రామారావుతో అప్పటికే విభేదాలు ఏర్పడ్డా ఇద్దరూ వాటిని పక్కన పెట్టి వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో నటించారు.
1982లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’ కూడా ఒక్క యుగళగీతం లేకున్నా బాగా ఆడింది. మలయాళంలో విజయవంతమైన సినిమాను తెలుగు రాజకీయ వాతావరణానికి అనుగుణంగా అడాప్ట్ చేసిన ఈనాడు సినిమా సరిగ్గా 1982లో ఎన్నికలకు ముందు విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అదే తరహాలో ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధి, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి వంటి సినిమాల్లో నటించారు.
1980ల మధ్యలో కృష్ణ నటించిన సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మొనగాడు వంటి వంటి సినిమాలు ఘన విజయాల్ని సాధించి కృష్ణ సినీ జీవితంలో మైలు రాళ్ళుగా నిలిచాయి.కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ సినిమా తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది.1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగారు.1993లో పచ్చని సంసారం, వారసుడు సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధించాయి. ఆతర్వాత 1995 మధ్యకాలంలో నెంబర్ వన్, అమ్మదొంగా సినిమాలు విజయాన్ని సాధించాయి. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన ‘తెలుగువీర లేవరా’ కృష్ణకు 300వ చిత్రం. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన "శ్రీశ్రీ" కృష్ణ చివరి చిత్రం.
నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా సైతం కృష్ణ రాణించారు. పద్మాలయ సంస్థ తరుపున హిందీ, తెలుగు మరియు ఇతర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఆయన దర్శకత్వం వహించిన సింహాసనం చిత్రం భారత సినీ చరిత్రలో అద్భుతమైన కళా ఖండంగా నిలిచిపోయింది. మొత్తం 17 సినిమాలకు దర్శకత్వం వహించారు.
కృష్ణకు సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది. సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాత ఆయన. విడుదలైన సినిమాల కలెక్షన్లైనా, సినిమా ఆడబోయే రోజులెన్ని అన్నదైనా మంచి అంచనా ఉండేది. తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాకా విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవారు. ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణ చెప్తుంటే తోటి నటులు, సాంకేతిక నిపుణులు ఆశ్చర్యంగా వినేవారు.సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణ స్వంతంగానూ, భాగస్వామ్యంలోనూ వ్యాపారాలు చేసి అనుభవం గడించారు.
కృష్ణను సంక్రాంతి హీరో అంటారు.1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేసి భారీ విజయాలను అందుకున్నారు. తన ముందు తరం హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు)లు తమ సినిమాలు విడుదల చేసినా వారివి కృష్ణలా వరుసగా విడుదల కాలేదు.
తెలుగునాట మల్టీస్టారర్ చిత్రాలు అంటే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చేది కృష్ణ. అత్యధిక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన హీరోగా కృష్ణ రికార్డ్ సృష్టించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, రజనీకాంత్, మోహన్ బాబు,చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మహేశ్‌బాబు వంటి పలువురు హీరోలతో కృష్ణ నటించారు. వీరందరిలోనూ నటభూషణ్ శోభన్ బాబుతోనే ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో 17 మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. కృష్ణ తన నట జీవితంలో మొత్తం 80 మంది హీరోయిన్ల సరసన నటించారు. అందులో 47 సినిమాల్లో విజయనిర్మలే హీరోయిన్. ఆతర్వాత జయప్రద 42 చిత్రాల్లో, శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి, చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ జోడీలుగా గుర్తింపు పొందారు.
కృష్ణ రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు. కృష్ణ కుటుంబం తోలి నుంచి రైతు బాంధవుడు ఆచార్య ఎన్.జి.రంగా గారిని అభిమానించేవారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు టాలీవుడ్ నుంచి కృష్ణ ఒక్కరే ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చారు. రాజీవ్ గాంధీతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు కారణంగా అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తూ 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి ఆ పార్టీ గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాకుండా, 1989లో ఏలూరు ఎంపీగా కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు. అయితే, 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడంతో పాటుగా, తన సొంత నియోజకవర్గం గుంటూరును కాంగ్రెస్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
కృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇందిర, రెండో భార్య ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల. కృష్ణ సినిమాల్లోకి రాకముందే ఇందిరతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, పెద్ద కుమారుడు రమేష్ బాబు సైతం హీరోగా పలు చిత్రాల్లో నటించారు. చిన్న కుమారుడు మహేశ్‌బాబు కృష్ణ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలో విజయనిర్మలతో నాలుగైదు సినిమాలు చెయ్యగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పరస్పర అంగీకారంతో 1969లో ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నారు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా, ఎటువంటి భేషజాలు లేకుండా ఆ సంగతిని అంగీకరించేవారు. తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది.తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవారు.
తెలుగు సినిమా చలన చిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా ఎన్టీఆర్ తర్వాత కృష్ణ నిలిచారు.తాను ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తరం హీరోల్లో ఏ ఒక్కరికి సాధ్యం కానీ అశేషమైన అభిమానూలు ఆయన సొంతం అంటే అతిశయోక్తి కాదు.ఆరోజుల్లో కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. కృష్ణ అభిమానులంటే సామాజిక సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. ఆయన పేరు మీద అభిమానులు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
కృష్ణ సుదీర్ఘ నట జీవితంలో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలు పెద్దగా పొందలేదు అనే చెప్పాలి.అల్లూరి సీతారామరాజు చిత్రానికి 1974లో ఉత్తమ నటునిగా నంది అవార్డు ఒక్కటే దీనికి మినహాయింపు.అతిపెద్ద మాస్, కమర్షియల్ హీరోగానే కృష్ణను గుర్తించారు. అయినప్పటికీ అభిమానులకు మాత్రం ఆయన గొప్ప నటుడు. తెలుగు నాట ఎన్టీఆర్ తర్వాత ప్రజల స్వచ్ఛంద ఆమోదంతో "సూపర్ స్టార్" బిరుదును అందుకున్న ఏకైక హీరో కృష్ణ.1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు.
తెలుగు చలన చిత్ర రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన సినిమాలు ప్రయోగాలు చేయడం వంటివి కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గాను 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం కృష్ణను ‘పద్మభూషణ్’ పురస్కారం వంటి గౌరవాలు ఆయనకు లభించాయి.
తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన ఈ అసాధ్యుడు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలబడిన కృష్ణ ఎన్నో దెబ్బలుతిన్నారు. ‘తేనెమనసులు’ టైంలో స్కూటర్‌మీంచి నాలుగైదుసార్లు పడి గాయపడ్డారు. ‘కన్నెమనసులు’లో గుర్రం మీంచి పడి ఒళ్లు హూనం చేసుకున్నారు. ‘ఇద్దరు మొనగాళ్లు’ ఫైట్స్ సీక్వెన్సుల్లో కత్తిగాట్లకు రక్తం ఓడి జ్వరమొచ్చింది. ‘గూఢచారి 116’ షూటింగులో మామూలు దెబ్బల మాటెలావున్నా, పహిల్వాన్ నెల్లూరు కాంతారావుని పైకెత్తబోయి పడి, ఎడమ మోకాలు దెబ్బతింది. ఇన్ని దెబ్బలు కాచుకొని ముందుకురికాడు కాబట్టే కృష్ణ సూపర్‌స్టార్ అయ్యారు.రోజూ మూడు షిఫ్టుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలదాకా ఏకబిగిన నటించి నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు కృష్ణ చలనచిత్ర ప్రస్థానంలో ఎన్నో ఉన్నాయి.
మంచితనం, నిజాయితీ, నిబద్దత కృష్ణకున్న సుగుణాలు. సగటు ప్రేక్షకుడి వినోద సాధనమైన సినిమా కన్నులపండువగా వుండాలని ఆశించి, తెలుగు సినిమాకు భారీతనాన్ని చేకూర్చి, కళ్లముందు స్వప్నజగత్తును ఆవిష్కరించిన ఘనత కృష్ణదే! తెలుగు చిత్రసీమ కృష్ణకు ఎప్పుడూ రుణపడి వుంటుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!