చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవిత

- June 20, 2024 , by Maagulf
చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవిత

అమరావతి: సమకాలీన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ నైపుణ్యాలను కాపాడుకుంటూ చేనేత రంగాన్ని అభివృద్ది పధంలో పయనింపచేయటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆధునిక ఫ్యాషన్ పోకడలతో సాంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ యువతరం డిమాండ్‌లకు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా సవిత బాధ్యతలను స్వీకరించారు. చేనేత, జౌళి శాఖతో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖ మంత్రిగా కూడా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి, వెంకటగిరి, చీరాల, ధర్మవరం, పులుగుర్తలలో చేనేత వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అమలుకు సంబంధించి తొలి సంతకం చేనేత, జౌళి శాఖ మంత్రిగా చేశారు. మొత్తం 180 మంది నేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమం రూపొందింది. 

మరోవైపు ఆప్కో(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ) సహకారంతో చేనేత, జౌళి శాఖలోని అంతర్గత క్లస్టర్ డిజైనర్లు రూపొందించిన కొత్త వస్ర్తాల సేకరణను సవిత ప్రారంభించారు. స్థానిక కళాకారులకు మద్దతుగా మంత్రి ఆప్కో నుండి క్రోచెట్ లేస్ కాటన్ చీర, లేపాక్షి నుండి ఏటికొప్పాక ఎద్దుల బండిని కొనుగోలు చేశారు.ఈ కొనుగోళ్లు ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, హస్తకళను ప్రోత్సహం, సంరక్షణలో ఆమె నిబద్ధతను నొక్కిచెప్పాయి. రాష్ట్రంలో ఓడిఓపి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఓడిఓపి ప్రదర్శనను కూడా మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఆప్కో ఎండి పావన మూర్తి, జిఎం తనూజ రాణి, లేపాక్షి ఎండి బాలసబ్రమణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com