జనసంఘ్ పితామహుడు..!
- June 23, 2024స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించినా… జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పని చేసినా.. దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి ఎవరంటే.. ముందుగా మనకు గుర్తుకు వచ్చే పేరు.. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన భావజాలంతో.. సుధీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారు.నేడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్థంతి.
డాక్టర్ ముఖర్జీ 1901 జూలై 6 న కోల్‌కతలో జన్మించారు.అనతికాలంలోనే హిందువుల తరఫున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందు మహాసభలో ప్రవేశించి 1944లో ఆ సంస్థ అధ్యక్షుడైనారు. ముఖర్జీ ముస్లిములకు వ్యతిరేకి కాకున్ననూ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకొనే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించారు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మతకలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించాడు. ముస్లిం ఆధిక్యత కల ప్రాంతాలలో ముస్లింలీగ్ పాలిత ప్రాంతాలలో హిందువులు ఉండరాదని తన గళం వినిపించారు.
స్వాతంత్య్రానంతరం నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్ ముఖర్జీ కి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వ శాఖను కేటాయించారు.అయితే, 1949లో నెహ్రూ పాకిస్థాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందం (ఆర్టికల్ 370) అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, బయటికి వచ్చారు.డాక్టర్ ముఖర్జీ తన సైద్ధాంతిక కట్టుబాట్లతో ఎప్పుడూ రాజీపడలేదు.నెహ్రూ కేబినెట్ నుంచి ఆయన ఆయన వైదొలగడం దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం ఆవిర్భావానికి పునాది వేసింది.
జమ్మూ కాశ్మీర్ సమస్యను ముందుగా అర్థం చేసుకున్న వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 ని తీసుకురావడాన్ని ఆయన ఖండించారు. ఆ సమస్యపై పోరాటం మొదలు పెట్టారు. దానికి పూర్తి పరిష్కారం కోరుతూ తన గళమెత్తారు. బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు భారతదేశ హక్కులు, ప్రయోజనాల కోసం విజయవంతంగా పోరాడిన వ్యక్తి కూడా ఆయననే చెప్పవచ్చు.
స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ భారతీయులపై దిగుమతి చేసుకున్న భావజాలాలను, సిద్ధాంతాలను రుద్దడం మొదలు పెట్టింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి కూడా డాక్టర్ ముఖర్జీనే. పోరాటంలో.. ప్రజలను సమీకృతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రతి భారతీయుడికి అత్యంత అనుకూలమైన, స్థిరమైన జీవన విధానంగా రాజకీయ, సామాజిక భావజాలాన్ని ప్రోత్సహించడంలో డాక్టర్ ముఖర్జీ ముఖ్యపాత్ర పోషించారు.
భారతదేశ స్వాతంత్య్రం పోరాటం కోసం వివిధ రాజకీయ పార్టీలు, వివిధ భావజాలాలున్నవారంతా కాంగ్రెస్ గొడుగు కిందికి వచ్చి పోరాటం చేశారు. కానీ స్వాతంత్య్రం తరువాత దేశంలో రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి… కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయం కావాలనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. సాంస్కృతిక జాతీయవాదం, జాతీయ సమైక్యత రాజకీయ భావజాలం కోసం భారతదేశం ఆసక్తిగా చూస్తోంది. ఈక్రమంలో దేశంలో ఈ చర్చకు జెండా మోసేవారిగా ఉద్భవించారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.. చివరికి జనసంఘ్ ఏర్పడటానికి దారితీసింది.
అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ ఏర్పడింది. అతని రాజకీయ ప్రయత్నాల వల్లనే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అందులో జాతీయత, భారతీయత స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. గత అనేక దశాబ్దాలుగా చాలా ముఖ్యమైన మైలురాళ్లను దాటి, అనేక యుద్ధాలతో పోరాడాము. ఈ రోజు మనం ఉన్న చోటికి చేరుకోవడానికి అనేక తిరుగుబాట్ల నుండి బయటపడ్డాము.
జనసంఘ్ ఆవిర్భావం తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్ 1951–52 ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాలను సాధించింది. కోల్‌కతా పార్లమెంట్ స్థానం నుంచి డాక్టర్ ముఖర్జీ ఎంపికయ్యారు. అతని ఆలోచనల్లో ఉన్న స్పష్టత… అతని భావజాలం పట్ల ఆయనకున్న నిబద్ధత, దూరదృష్టిలో పెట్టుకుని ఆయన్ను పార్టీలు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నాయి. సభలో ప్రతిపక్షాల గొంతుగా మారిపోయారు డాక్టర్ ముఖర్జీ. నిజానికి, కాంగ్రెస్ వాదిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ముఖర్జీ.. ఆ పార్టీ తీరు నచ్చక కేంద్ర పదవిని సైతం వదులుకుని బయటికి వచ్చేశారు. కొత్తగా పార్టీని స్థాపించి స్వేచ్ఛా విధానానికి మద్దతు పలికారు.
కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తీసుకురావడాన్ని ఖండించారు. ఈ చట్టం వల్ల దేశ సార్వభౌమత్వానికి పెద్ద అడ్డంకులుగా మారుతాయాని ఆయన భావించారు. ఈ సమస్యపై పార్లమెంటులో పలు సందర్భాల్లో స్వరం సైతం వినిపించారు.
జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని (ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే) అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నినదించారు. ఢిల్లీ నుండి ప్యాసింజర్ రైలులో జమ్ము కశ్మీర్ పర్యటన ప్రారంభించారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులకు ఆదేశాలందాయి. జమ్మూలోకి ప్రవేశిస్తున్నప్పుడు డాక్టర్ ముఖర్జీని అరెస్టు చేశారు.
డాక్టర్ ముఖర్జీని అరెస్ట్ చేసి అరెస్టు అయిన 40 రోజుల తరువాత రాత్రి బటోటె పట్టణానికి తరలించారు. మరుసటి రోజు ఉదయం శ్రీనగర్‌కు తరలించారు. నిర్మానుష్యమైన చిన్న గదిని సబ్ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారు. ఈ క్రమంలో 1953 జూన్ 23వ తేదీ తెల్లవారుజామున భారత మాత ముద్దు బిడ్డ డాక్టర్ ముఖర్జీ తుది శ్వాస విడిచారని అధికారులు ప్రకటించారు.
సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్ వేస్తారు. కానీ ముఖర్జీ విషయంలో అలా జరగలేదు. ఆయన మరణం జవాబు లేని ప్రశ్నలకు దారితీసింది. ఆ తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా మారింది. డాక్టర్ ముఖర్జీ తల్లి యోగ్మయ దేవి తన కుమారుడి మరణంపై దర్యాప్తు కోరుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు లేఖ రాశారు. కానీ ఈ అభ్యర్థన కూడా తిరస్కరించబడింది. ఈ రోజు వరకు డాక్టర్ ముఖర్జీ అరెస్టు .. మరణానికి సంబంధించిన విషయాలన్నీ రహస్యంగానే మిగిలిపోయింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







