అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగనున్నారా? సన్నిహితులు ఏమంటున్నారు?
- July 19, 2024
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
''నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు'' అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రాటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది.
ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపై ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్‌కు విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా తన మిత్రుల వద్ద ప్రైవేటుగా వ్యక్తపరిచారట. ఇక, పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్‌కే ఫోన్ చేసి.. రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడి వయసు, ఆయన ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఏర్పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







