ఓపెనింగ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. ఆశలో టెక్ ఫ్రెషర్స్..
- July 19, 2024
దేశీయ ఐటీ రంగంపై అలుముకున్న అస్థిర మబ్బులు వీడుతున్నట్లు ప్రస్తుత త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫలితాలను ప్రకటించిన టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి.
ఈ క్రమంలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న జాబ్ మార్కెట్లో పెద్ద కోలాహలం కొనసాగుతోంది.
దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ అంచనాలకు మించి బలమైన లాభదాయకతను కంపెనీ నమోదు చేసింది. అలాగే వ్యాపారంలో కొనసాగిన గడ్డు పరిస్థితులతో క్యాంపస్ హైరింగ్ నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే 2025 సంవత్సరంలో కొత్తగా ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
2025 ఆర్థిక సంవత్సరానికి 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. దీంతో రాబోయే కళాశాల గ్రాడ్యుయేట్లకు ఆశలను కలిగిస్తోంది. వాస్తవానికి క్యాంపస్ హైరింగ్ నిర్వహించటానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర మార్గాల్లో ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11,900 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. దీనికి ముందు FY23లో 50,000 మంది ఫ్రెషర్ల నుంచి 76 శాతం క్షీణత కనిపించింది. గడచిన కొన్ని త్రైమాసికాలుగా తాము చురుకైన హైరింగ్ బేస్‌కి మారినట్లు జూలై 18న జరిగిన కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 2000 మంది ఉద్యోగుల క్షీణతను చూసింది. వాస్తవానికి ఇది అంతకు ముందలి త్రైమాసికం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 85 శాతం మందిని వివిధ ప్రాజెక్టుల్లో వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే వ్యాపార వృద్ధికి అనుగుణంగా కొత్త హైరింగ్స్ ఉంటాయని జయేష్ సంఘ్రాజ్కా పేర్కొన్నారు. తాము వృద్ధిని ఎలా చూస్తాము అనేదానిపై ఆధారపడి ఈ సంవత్సరం 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో భారత ఐటీ సేవల రంగంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ FY25లో దాదాపు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మెుదటి త్రైమాసికంలో దాదాపు 11,000 మంది ట్రైనీలను నియమించుకున్నట్లు కంపెనీ ఇటీవల తన క్యూ1 ఆర్థిక ఫలితాల్లో ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస్ హెడ్ కౌంట్ వరుసగా ఆరో త్రైమాసికంలో గతంతో పోల్చితే 1908 మేర తగ్గుదలను చూసింది. అయితే మార్చి కాలంతో పోలిస్తే టీసీఎస్ మొత్తం హెడ్‌కౌంట్ 1,759 వరుసగా పడిపోయింది. HCLTech హెడ్‌కౌంట్ వరుసగా 8,080 తగ్గగా, LTIMindtree 284 మంది ఉద్యోగులను క్యూ1లో కొత్తగా జోడించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









