డైలాగ్ కింగ్...స్పెషల్ స్టోరీ
- July 27, 2024
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్’.. అంటూ తన గంభీరమైన స్వరంతో, విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాయి కుమార్.. పూర్తి పేరు పుడిపెద్ది సాయి కుమార్. 1960 జులై 27న నటుడు పి.జె.శర్మ , కృష్ణ జ్యోతి దంపతులకు మొదటి కుమారుడిగా జన్మించారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యారు. తండ్రి పిజె శర్మ డబ్బింగ్ కళాకారుడు, నటుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే సినీ పరిశ్రమ పై అనుబంధం ఏర్పడింది.
అక్టోబర్ 20, 1972.. నటుడిగా సాయికుమార్ జన్మదినం. లెజెండరీ కమెడియన్ రాజబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 52 సంవత్సరాల కింద డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ నిర్వహించిన నాటకంలో దుర్యోధనుడి పాత్రతో రంగస్థలం ప్రవేశం చేశారు సాయికుమార్. ఆరోజు ఆ ప్రదర్శన చూడడానికి మరో లెజెండరీ నటుడు స్వర్గీయ ఎస్వీ రంగారావు గారు రావడం.. దుర్యోధనుడిగా ఆ నటన చూసి ప్రశంసించడం ఆయన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెప్తుంటారు.
అలాగే ఆరోజు జరిగిన ప్రదర్శనకు ఎంతో మంది సినీ అతిరథ మహారథులు హాజరయ్యారు. ఆ రోజు వాళ్ళిచ్చిన ఆశీర్వచనాలే ఈ రోజు నాకు వచ్చిన ఈ స్థాయి అని ఎంతో వినమ్రంగా చెప్తుంటారు సాయి కుమార్. శ్రీ కాకరాల, జె.వి రమణ మూర్తి శిక్షణలో ఈయన పరిణతి చెందారు.డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్టీ రామారావు నటించిన సంసారం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సాయి కుమార్. అలాగే బాల నటుడిగా శోభన్ బాబు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి సినిమాతో తెరంగేట్రం చేశారు.
కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సప్తపది సినిమాలో ఏకులం నీదంట సాంగ్ లో కనిపించిన చిన్నారి బాలుడు సాయికుమార్.. బాలనటుడిగా దేవుడు చేసిన పెళ్లి ఎం,మూవీలో సాయికుమార్న అంధుడిగా నటించి వావ్ అనిపించాడు..1979 లో వచ్చిన గోరింటాకు సినిమాలో మహానటి సావిత్రి గారి కొడుకు “రాముడు” పాత్ర పోషించారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాటలో సాయి కుమార్ కనిపించాడు.
ఇక బాలనటుడి నుంచి ఆర్టిస్టుగా ఛాలెంజ్ సినిమాలో సుహాసిని తమ్ముడిగా అడుగు పెట్టాడు.. ఓ వైపు డబ్బింగ్ చెబుతూనే మరోవైపు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ.. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.. మరోవైపు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కానీ ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘పోలీస్ స్టోరీ’. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో మారు మోగాయి.
సాయి కుమార్ ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో అద్భుతంగా నటించారు. ఎంతలా అంటే అప్పటి తరం ఆడియన్స్ పోలీస్ రోల్ అంటే సాయి కుమారే చేయాలి అనేంతలా. ఈ మూవీలో కనిపించే మూడు సింహాలు చట్టానికీ,న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే…కనిపించని ఆ నాల్గో సింహమేరా పోలీస్ అని చెప్పిన డైలాగ్.. ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. అంతలా తన డైలాగులతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. అలా సినిమా సినిమాకు తనదైన నటనతో డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో ఎన్నో విభిన్న రకాల పాత్రలను పోషించారు. ప్రతి పాత్రలోనూ కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తారు. తన గొంతుతో అనేక మంది హీరోలకు డబ్బింగ్ చెప్పి, వారికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టారు.
సుమన్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు ఆయన గాత్రదానం చేశారు. బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ కు సైతం డబ్బింగ్ చెప్పారు. ఆయన నటించిన ‘ఖుధా గవా’ అనే సినిమా ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి సాయి కుమార్ వాయిస్‌ఓవర్ అందించాడు. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ..సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకుసైతం డబ్బింగ్ చెప్పిన ఘనత ఆయనకే దక్కింది. ఒక్క కమల్ హాసన్‌కు తప్ప మిగతా దక్షిణాది హీరోల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన రికార్డు సాయి కుమార్ సొంతం.
మరోవైపు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి ఎంతో మంది అగ్రహీరోలు తమిళంలో డబ్ చేసిన సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సాయికుమార్ తన గాత్రంతో "యువ కళా వాచస్పతి" అనే బిరుదును పొందారు. సామాన్యుడు సినిమాలోని నటనకు కాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది బహుమతి అందుకున్నారు.
సాయి కుమార్ కెరీర్ లో మరో మైలు రాయి ‘ప్రస్థానం’. ఈ చిత్రంలో ఆయన చేసిన డైలాగ్‌లు ఆయన్ని పరిశ్రమలో తిరుగులేని డైలాగ్ కింగ్‌గా నిలబెట్టాయి. ‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్‌లు లేరన్నాటకంలో’ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. హీరోగానే నుంచి విలన్‌గా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఆయన..కెరీర్‌లో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే తన తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ కూడా సినీ రంగంలో రాణించడానికి ఆయనే ప్రేరణ. సాయి కుమార్ తనయుడు ఆది కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
నాటకాలతో మొదలైన ప్రస్థానం సినిమాలు, సీరియళ్లు, గేమ్ షోస్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వెబ్ సిరీస్‌లు ఇలా ఎన్నో విధాలుగా తనను ప్రేక్షకులకు పరిచయం చేసుకునే అవకాశం వచ్చినందుకు సదా కృతజ్ఞుణ్ణి అని చెప్పారు. సాయికుమార్.. ఆయన స్వరం రగిలించే భాస్వరం, ఆయన రూపం గంభీరం, ఆయన నటన అద్వితీయం, తెరపై ఆయన ఆవేశం అద్భుతం, ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే అభినయం ఆయన సొంతం, ఏ పాత్రకైనా తన స్వరంతో ప్రాణ ప్రతిష్ట చేయడం దేవుడు ఆయనకు ఇచ్చిన వరం, 5 దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం పదిలం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







