మైనింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
- July 31, 2024
అమరావతి: మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు.గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సమీక్షించారు.మైనింగ్ శాఖ ఆదాయంలో 2014-19 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా, 2019-24 మధ్య 7 శాతానికి పడిపోయిందని అధికారులు వివరించారు. మైనింగ్ లో అస్తవ్యస్థ విధానాలు, అక్రమాల వల్ల ప్రభుత్వం రూ.9,750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. 5 ఏళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపైనా సీఎం సమీక్షించారు. ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.1,025 కోట్లు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని అన్నారు. మైనింగ్ లో గత ప్రభుత్వ అక్రమాలను పూర్తిగా తవ్వితీయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించాలని సూచించారు.
ఉచిత ఇసుక పాలసీకి కట్టుబడి ఉన్నాం...సమస్యల పై దృష్టిపెట్టండి.
ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తవ్వకం, సీనరేజ్, రవాణా చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చనేదే తమ విధానమని పేర్కొన్నారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా సీఎం ప్రత్యేకంగా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా కొత్తగా ఏయే విధానాలు అవలంభించవచ్చు అనే అంశంపై అధికారులతో చర్చించారు. రీచ్ నుంచే నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని అన్నారు. కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు భారం కాకుండా చూడాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఇసుక పాలసీ అమలుపై ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ఇసుక నుంచి ఎటువంటి ఆదాయం ఆశించడం లేదని....అక్రమాలు జరగకుండా వినియోగదారులకు ఇసుక చేర్చేందుకు అవసరమైన మెకానిజం చూడడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలిగించవద్దు సూచించారు. పట్టాల్యాండ్స్ లో సీనరేజ్ కట్టి అమ్ముకునే అవకాశం కల్పిద్దాం అన్న అధికారుల సూచనలకు సీఎం ఆమోదం తెలిపారు. కొన్ని చోట్ల టన్ను రూ.150లకే లభిస్తున్నా...కొన్ని చోట్ల స్టాక్ పాయింట్ల వద్ద అంతే ధరకు లభించడం లేదని....దూర ప్రాంతాల నుంచి రవాణా చేయడం వల్లనే ఈ సమస్య ఉందని అధికారులు తెలిపారు. నేరుగా రీచ్ నుంచి వినియోగదారుడికి ఇసుక చేరే విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుత సీజన్లో కొరత లేకపోయినా...ధర విషయంలో అక్కడక్కడా ఉన్న ఇబ్బందులు పరిష్కారం కావాలని సీఎం అన్నారు. రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. ఎపిఎండిసి ద్వారా ఈ ఏడాది అదనంగా 500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల ద్వారా వాల్యూ ఎడిషన్ ఎలా చేయవచ్చునోమ చూడాలని సీఎం అన్నారు. మన వద్ద లభించే మినరల్స్ ను మెరుగుపరిచే పరిశ్రమలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలపై ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయని....అనుమతి లేని చోట్ల, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని చెప్పారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి...సాక్ష్యాధారాలు సేకరించాలని సీఎం సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







