రాజకీయ ఉద్దండుడు-గంగవరపు
- August 06, 2024
చరిత్రలో కనుమరుగై పోయిన అసమాన రాజకీయ నాయకుడు అతడు. పరిపాలన దక్షత, సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ చివరి వరకు ఎటువంటి రాజకీయ ఉన్నత పదవులు చేపట్టలేదు. అయితేనేమి నాటి బెజవాడ గోపాల్ రెడ్డి నుండి నేదురుమల్లి జనార్ధన రెడ్డిల దాక ముఖ్యమంత్రులందరితో సన్నిహిత సంబంధాలు నెరిపి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. అధికారాన్ని చూసుకొని అహంకారంతో మిడిసిపాటు పడిన రాజకీయ నేతలకు శృంగభంగం కలిగించారు. తను పార్టీ కోసం సర్వం అర్పించి ఏమి ఆశించని నిస్వార్థ జీవిగా నిలిచిపోయారు స్వర్గీయ గంగవరపు తిరుపతి నాయుడు.
ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని వెంకటగిరి జమీందారీలో భాగమైన ఆత్మకూరు ఫిర్కాలోని పొనుగోడు గ్రామంలోని పెద్ద రైతు కుటుంబంలో గంగవరపు తిరుపతి నాయుడు గారు జన్మించారు. ప్రాథమిక దశలోనే చదువును ముగించినా తనకున్న వ్యవహారిక జ్ఞానం ద్వారా సమాజాన్ని చదివారు. వ్యవసాయం చేస్తూనే వెంకటగిరి జమీందారీ ఉద్యోగులు గ్రామాల్లో చేస్తున్న దౌర్జన్య భూమి శిస్తు వసూళ్లకు వ్యతిరేకంగా తమ గ్రామస్తులను కూడగట్టడంలో ముందుండేవారు.
వెంకటగిరి జమీందారులు నానాటికి రైతుల మీద పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆచార్య రంగా నేతృత్వంలోని జమీన్ ఉద్యమంలో యువకులైన నాయుడు గారు సైతం పాల్గొన్నారు. రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మెట్ట సీమ రైతుల తరుపున జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తుల్లో నాయుడు గారు ముఖ్యులు. ఆచార్య రంగా, జమీన్ రైతు పత్రిక వ్యవస్థాపకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు, నాగినేని వెంకయ్య, కటికనేని సోదరులు వంటి మొదలైన ముఖ్యనేతలతో నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
జమీందారీ వ్యవస్థకు అనుకూలమైన జస్టిస్ పార్టీకి వ్యవతిరేకంగా రంగా గారి ఆధ్వర్యంలో జమీన్ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, తిరుపతి నాయుడు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రంగా స్థాపించిన రైతు కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఆయన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే మహాత్మా గాంధీ సిద్ధాంత భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. మహాత్మాడు చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతుగా ఆత్మకూరు ప్రాంతంలో నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి.
ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయుడు గారు తీవ్రంగా శ్రమించారు. రైతు కాంగ్రెస్ నాయకుడిగా రైతుల ఆధ్వర్యాన స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలోనే నెల్లూరు ప్రాంతానికి చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేతలు రేబాల పట్టాభి రామిరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, నలమోతు చెంచు రామా నాయుడు వంటి నాయకులకు దగ్గరయ్యారు. ఇదే సమయంలో ఆయన అతిపెద్ద సమితిగా పేరుపడ్డ ఆత్మకూరు సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంకటగిరి జమీ రద్దు కావడం, కాంగ్రెస్ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించిన తరువాత 1952 సార్వత్రిక ఎన్నికల్లో మద్రాస్ అసెంబ్లీకి ఆత్మకూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడి కమ్యూనిస్టు మద్దతుదారుడైన జి.సి.కొండయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆయన్ని రాజకీయంగా వెనుకబడేటట్టు చేసింది. అసెంబ్లీలో అడుగు మోపలేకపోయినా ఆత్మకూరు సమితి అధ్యక్షుడిగా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల బాధ్యతను తనపై మోపుకొని 1955 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
ఉమ్మడి మద్రాస్ మరియు విశాలాంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకుడు బెజవాడ గోపాల్ రెడ్డి(బెగోరే). 1955 ఎన్నికల ముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో గెలుపు సునాయాసం కాదనే సూచలనతో వేరే నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్న సమయంలో నాయుడు గారు వారిని ఆత్మకూరు నుండి పోటీ చేయాలని కోరగా గోపాల్ రెడ్డి అంగీకరించారు. గోపాల్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారానికి రాకపోయినా నాయుడు గారే అన్నితానై వ్యవహరించి బెజవాడను గెలిపించారు. ఆత్మకూరు నుంచి ఎన్నికైన తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యారు. గోపాల్ రెడ్డి కారణంగా తిరుపతి నాయుడు గారి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగింది.
రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ బిజీగా ఉండే సమయంలో ఆయన ప్రతినిధిగా గంగవరపు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. నెల్లూరు రాజకీయ ఉద్దండులు ఏసీ సుబ్బారెడ్డి, చెంచు రామానాయుడులకు ధీటుగా తిరుపతి నాయుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పారు.ఏసీతో ఉన్న వ్యతిరేకత కారణంగానే నీలం సంజీవరెడ్డికి దగ్గరయ్యారు. అనంతర కాలంలో బెజవాడ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఏసీ సుబ్బారెడ్డితో కలిసిపోయారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఏసీ సుబ్బారెడ్డి, చెంచు రామానాయుడు వర్గానికి మెట్ట సీమలో బలం చేకూర్చడంలో నాయుడు గారి పాత్ర కీలకం. ఏసీ సోదరుడి కుమారుడైన ఆనం సంజీవ రెడ్డిని 1962లో ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయించి గెలిపించారు. ఏసీ చివరి రోజుల్లో తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావడంతో ఆయనకు వ్యతిరేక వర్గానికి మారి 1967 ఎన్నికల్లో మెట్టసీమలోని ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ఆనం కుటుంబం నిలిపిన అభ్యర్థుల మీద స్వతంత్ర పార్టీ తరుపున తన సన్నిహితులైన పెళ్లకూరు రామచంద్రారెడ్డి, ధనేకుల నరసింహం, గొట్టిపాటి సుబ్బానాయుడులను పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నారు. కాంగ్రెస్ కంచుకోటలైన ఈ మూడు నియోజకవర్గాల్లో నాయుడు గారి అభ్యర్థులు గెలుపొందడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా చాటారు.
ఆనం కుటుంబంతో రాజకీయ వైరం తీవ్ర రూపం దాల్చి నాయుడు గారు రాజకీయంగా ఉన్నతిని సాధించలేకపోయారు. చట్ట సభల్లో తానూ అడుగు పెట్టలేకపోయినా తన అనుచరులను మాత్రం పంపించగలిగారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడ్డ సమయంలో సైతం ఇందిరా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ ఎన్నికల్లో రాపూరు నుంచి వెంకటరత్నం నాయుడు, ఆత్మకూరు నుంచి సుందరరామిరెడ్డిన, కావలి నుండి యానాది రెడ్డిలను గెలిపించారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తిరుపతి నాయుడు గారి గురించి తెలుకొని, ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించినా నిర్ద్వందంగా తిరస్కరించారు. నాయుడు గారు బ్రతికున్నంత కాలం ఆయన్ని పార్టీలోకి రప్పించేందుకు ఎన్టీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరలేదు. 1985,1989 ఎన్నికల్లో ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నెల్లూరు జిల్లా మెట్ట సీమలో తన పట్టును నిరూపించారు.
తిరుపతి నాయుడు గారు పట్టుదల, ఆత్మాభిమానం మెండుగా ఉన్న మనిషి. తనను నమ్ముకున్న మెట్ట సీమ ప్రాంత ప్రజానీకం కోసం రాజకీయ ఉద్దండులను ఢీ కొట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అహంకారంతో విర్రవీగిన ఆనం కుటుంబాన్ని రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టిన వ్యక్తిగా ఆనాటి రాజకీయ విశ్లేషకులకు ఆయన అత్యంత సుపరిచితుడు. పైరవీలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉన్నా, సీఎంలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఎమ్యెల్యే లేదా నామినేటెడ్ పదవుల కోసం ఆయన ఏనాడు పైరవీలు చేయలేదు.
నాయుడు గారు గొప్ప పరిపాలనా దక్షులు. రెండు పర్యాయాలు ఆత్మకూరు సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన ఆయన మెట్ట ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసారు. సాగు, త్రాగు నీటి కోసం రైతులు, ప్రజలు అవస్థలు పడకుండా చెరువులు, గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి పరిచారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండో దశ కాలువలు నిర్మాణం నెల్లూరు మెట్ట సీమ వరకు పొడిగించాలని ఆనాడే రైతుల తరుపున ప్రభుత్వాలకు వినితి పత్రాలను సమర్పించారు. జిల్లావ్యాప్తంగా రోడ్లు, స్కూళ్ళు స్థాపించేందుకు జిల్లా పరిషత్ నిధులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయించారు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీలే ఆభరణంగా మార్చుకున్న వ్యక్తి తిరుపతి నాయుడు గారు. ఒకరిని పదవిలో కుర్చీబెట్టడమే తప్పించి తాను ఏనాడు పదవులు ఆశించలేదు. ప్రజా జీవితంలో ఆయకున్న ఆస్తులను కరిగించుకున్నారు తప్పించి, అవినీతి మరకలను అటించుకోకుండా నిష్కళంకంగా బ్రతికారు. తన తరం నాయకుల్లా వారసత్వ రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించలేదు. ఈనాటికి ఆయన కుటుంబ సభ్యులు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
యువత రాజకీయాల్లో రావాలని కోరుకున్న వ్యక్తుల్లో తిరుపతి నాయుడు గారు ముందుంటారు. ఆయనే ఎందరో యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారు ఉన్నత స్థానంలో పైకి రావడానికి తనవంతు తోడ్పాటును అందించారు. వారి శిష్యుల్లో మాజీ మంత్రులు మాదాల జానకీ రామ్, కలికి యానాది రెడ్డిలతో పాటుగా మాజీ ఎమ్యెల్యేలైన ధనేకుల నరసింహం, గొట్టిపాటి సుబ్బానాయుడు, చెంచురామయ్య, బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, నువ్వుల వెంకట రత్నం నాయుడు, గొట్టిపాటి కొండపనాయుడు, కంచర్ల శ్రీహరి నాయుడు, కనిగిరి మాజీ ఎమ్యెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు, నెల్లూరు మాజీ ఎంపీ కామాక్షయ్య మొదలైన వారు ఉన్నారు. భారత దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సైతం తిరుపతి నాయుడు గారికి అభిమాని.
ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా అందరితో సఖ్యతగా నాయుడు గారు మెలిగారు. తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి సోషలిస్టు దిగ్గజ నేత జి.సి.కొండయ్య గారితో చివరి వరకు సన్నిహిత సంబంధాలు నెరిపారు. కొండయ్య కాంగ్రెస్ పార్టీలో రావడానికి తన వంతు సహాయం కూడా చేశారు. కొండయ్య అకస్మాత్తుగా మరణించిన సమయంలో కూడా వారి కుటుంబానికి ఓదార్పునిచ్చారు. అలాగే, నలమోతు చెంచు రామానాయుడు మంత్రిగా జిల్లాకు వచ్చిన సమయంలో ఆయన్ని ఆత్మకూరుకు రప్పించి సత్కరించారు. ఇక ఆనం కుటుంబంతో ఎన్ని రాజకీయ బేధాభిప్రాయాలు ఉన్నా వ్యక్తిగతంగా వారితో సన్నిహిత సంబంధాలు నెరిపారు.
పదవులే రాజకీయ ఉన్నతికి కొలమానంగా తీసుకొని నాయకులను గౌరవించే సంస్కృతిలో గంగవరపు తిరుపతి నాయుడు లాంటి ప్రజా నాయకులు కనుమారుగై పోయారు.కానీ, నీతి, నిజాయితీలే ఆరో ప్రాణంగా బ్రతికిన ఆయన తన చివరి శ్వాస వరకు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!