ముగిసిన పారిస్ ఒలింపిక్స్ ..

- August 12, 2024 , by Maagulf
ముగిసిన పారిస్ ఒలింపిక్స్ ..

పారిస్: రెండు వారాలకు పైగా క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పారిస్ ఒలింపిక్స్ 2024  క్రీడలు ముగిశాయి. ఫ్యాషన్ నగరి, ప్రేమపురి పారిస్ లో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. షూటర్ మను భాకర్, హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ భారత్ కు పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకలు స్టెడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగాయి. అథ్లెట్ల పరేడ్ లో అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు తమ తమ దేశాల జెండాలను ప్రదర్శించారు. ఈ ఒలింపిక్స్ పోటీల్లో మొత్తం 205 దేశాలు పోటీ పడగా.. 84 దేశాలు కనీసం ఒక్క పతకమైన సాధించాయి.

పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికా, చైనా మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. సొంతగడ్డపై 2008లో జరిగిన ఒలింపిక్స్ లో ఒక్కసారి మాత్రమే అమెరికాను చైనా వెనక్కి నెట్టింది. అయితే, పారిస్ ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికాను దాటేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేసింది. చైనా అథ్లెట్లు గట్టిపోటీ ఇచ్చారు. కానీ, చివరకు అమెరికానే అగ్రస్థానంలో నిలిచింది. స్వర్ణ పతకాల్లో మాత్రం అమెరికా, చైనా సమానంగా నిలిచాయి. అమెరికా అథ్లెట్లు 126 పతకాలను సాధించారు. అందులో స్వర్ణం 40, రజతం 44, కాంస్యం 42 ఉన్నాయి. చైనా అథ్లెట్లు మొత్తం 91 పతకాలు సాధించారు. అందులో స్వర్ణం 40, రజతం 27, కాంస్యం 24 పతకాలు ఉన్నాయి. మూడు నాలుగు స్థానాల్లో జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి. జపాన్ 20 స్వర్ణాలతో మొత్తం 45 పతకాలు సాధించగా.. ఆస్ట్రేలియా 18 స్వర్ణ పతకాలతో మొత్తం 53 పతకాలను కైవసం చేసుకుంది. ఇక భారత్ అథ్లెట్లు మొత్తం 117 మంది పాల్గొనగా.. కేవలం ఆరు పతకాలతో 71వ స్థానంకు పరిమితమయ్యారు.

తర్వాతి ఒలింపిక్స్ పోటీలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో జరగనున్నాయి. గతంలో 1932, 1984లో అమెరికా నగరంలో ఒలింపిక్స్  క్రీడలు జరిగాయి. 44ఏళ్ల తరువాత మరోసారి విశ్వక్రీడకు అమెరికా అతిథ్యమివ్వబోతుంది. 2028 జులై 14న ఆరంభమయ్యే ఒలింపిక్స్  క్రీడలు.. జూలై 30వ తేదీన ముగుస్తాయి. అమెరికాలో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడను కూడా చేసే అవకాశం లభించనుంది. 1900 ఒలింపిక్స్ తరువాత తొలిసారి లాస్ ఏజెంలెస్ లో క్రికెట్ చూడబోతున్నాం. మరో పురాతన క్రీడ లాక్రాస్ కూడా పునరాగమనం చేయబోతుంది.

పారిస్ లో భారత్ అథ్లెట్ల పతకాలు..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మొత్తం ఆరు పతకాలు సాధించింది. వీటిలో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.
నీరజ్ చోప్రా–రజతం (జావెలిన్ త్రో)
మను భాకర్–కాంస్యం (షూటింగ్)
మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్–కాంస్యం (షూటింగ్)
స్వప్నిల్ కుసలే–కాంస్యం (షూటింగ్)
అమన్ సెహ్రావత్–కాంస్యం (రెజ్లింగ్)
భారత హాకీ జట్టు–కాంస్యం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com