విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

- September 01, 2024 , by Maagulf
విజయవాడలో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్

విజయవాడ: విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ఘాట్‌రోడ్‌ను మూసివేశారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇటు నందిగామ వద్ద వాగు పొంగడంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి-అద్దంకి రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. శనివారం సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలోని లక్కవరం రోడ్‌లో అత్యధికంగా 27.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిలుకూర్‌లో 26.7, మట్టంపల్లిలో 24, కోదాడలో 17, రఘునాథపాలెంలో 15, బాలారంతండా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com