పొలిటికల్ పవర్ స్టార్...!

- September 02, 2024 , by Maagulf
పొలిటికల్ పవర్ స్టార్...!

తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన.. అధికారం ఉన్నా.. లేకపోయినా ఒకటే మనస్థత్వం. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుంది. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా.. జీవితంలో ఎన్నో కష్ట, నష్టాలను ఎదురొడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి జనసేనాని. ఎన్నో ఓటములు ఎదురైనా.. విజయం కోసం ముందుకు సాగి.. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.సెప్టెంబర్‌ 2 వచ్చిందంటే చాలు పవన్‌ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.

 పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. 1971, సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో పవన్ జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు.

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్. అంచలంచలుగా ఎదుగుతూ.. తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయ‌న తీసే ఒక్కో సినిమా ఒక్కో ర‌కం. ఒక సినిమాను మ‌రో సినిమాతో పోల్చిచూడ‌లేం.. ఆయ‌న‌దో ప్ర‌త్యేకమైన పంథా. ప‌వ‌న్ ఒక ఆల్‌రౌండ‌ర్. ఆయ‌న న‌టుడు మాత్ర‌మే కాదు.. ద‌ర్శ‌కుడు, స్క్రిప్ట్ రైట‌ర్‌, డ్యాన్స‌ర్‌, సింగ‌ర్‌..ఇలా అన్ని ఫ్రేములపైనా ఆయ‌న‌కు అవ‌గాహ‌న కూడా ఉంది. హిట్ ప్లాపుల‌తో ఆయ‌న సినిమాల‌కు సంబందం ఉండ‌దు. ప‌వ‌న్ కల్యాణ్‌ యూత్‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ట్రెండ్ సెట్ట‌ర్‌..

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఆయనకు అభిమానులను చేసింది. అవును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వపరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. అది తనతో పరిచయం ఉన్నవాళ్ళకి, తన అభిమానులకి కూడా బాగా తెలుసు. తనలో ఎక్కువ సామాజిక సృహ దేశం కోసం మరేదో చెయ్యాలనే తపన, తన మాటల్లో తన చేతల్లో తన సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. అది బహుశా ఆయన పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు లేదా తను చుట్టూ చూసిన సమాజం కావచ్చు లేదా తనకు స్వయంగా ఎదురైన అనుభవాలు కావచ్చు లేదా తాను ఎక్కువగా చదివిన సోషలిస్టు, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు.  

అందువల్ల ఆయనలో ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్న అంతరాలు మరియు ప్రజలకి జరుగుతున్న అన్యాయం పట్ల నిరంతర మధనం వల్ల ఆయన అలా భిన్నంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. తను ఒకపక్క సినిమాలు చేస్తున్నప్పటికీ తన వంతుగా నమాజానికి దేశానికి ఏమి చెయ్యాలి అనే బాధ తనకి ఖుషి సినిమా నుండే ఉండేదని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అవినీతిపరుల అరాచకాలు ఇవన్ని తెలిసిన నేను కూడా ఇంట్లో కూర్చొని నా జీవితం నా సినిమాలు అని చూసుకుంటే ఇక ప్రజల సమస్యలు ఎలా తీరతాయని ఆయన అంటారు. మరోవైపు సామాన్యుల వెతలు ఎవరు చూస్తారనే ఆవేదన ఉండడంవల్ల తాను జనసేన పార్టీ పెట్టేలా చేశాయని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర సభల్లో చెప్పినమాట కాదనలేని సత్యం.  

సమాజహితం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఒక స్వచ్చంద సంస్థ పెడితే, న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచించి పెట్టిందే కామన్‌ మాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీపీఎఫ్‌) అనే స్వచ్చంద సంస్థ. తను అనుకున్నది చేయాలనే మనస్థత్వం ఉన్న ఆయన, ప్రజలకి న్యాయం చెయ్యాలంటే ముందుకే వెళ్ళాలని, ఎవరు అడ్డు చెప్పినా ఆగనంటూ తనే సొంత పార్టీ దిశగా అడుగులు వేసుకుంటూ తాను ఒక్కడుగా, ఇంత పెద్ద రాజకీయ చదరంగంలోకి ప్రజలే న్యాయనిర్దేతలుగా 14 మార్చి 2014న జనసేన పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు.

 సమస్యకు పరిష్కారం చూపించేవరకు నిద్రపోని వ్యక్తి పవన్. ఉద్దానం సమస్య ఉందని చెప్పి ఊరుకోలేదు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసిన నిజమైన నాయకుడు పవన్. అంతర్జాతీయ స్థాయి వైద్యబృందాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఇక్కడి సమస్యలపై అధ్యయనం చేయించి.. ప్రభుత్వాన్ని కదిలించిన నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయ కక్షతో ఇప్పటం ప్రజల ఇళ్లను జగన్ ప్రభుత్వం కూలిస్తే వారికి అండగా ఉంటానంటూ.. కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బులతో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించిన నేత జనసేనాని. అందుకే పవన్ ఏమి చేసినా వెరీ స్పెషల్. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు జనసేనాని.

2014 మార్చిలో ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీని స్థాపించి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా తెలుగుదేశం పార్టీని గెలిపించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అదే ప‌వ‌న్ కల్యామ్‌.. చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌నే కార‌ణంతో 2019 ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీ చేశారు. ఒకే ఒక్క‌సీటులో పార్టీ విజ‌యం సాధించింది. ప‌వ‌న్ పోటీ చేసినా రెండు స్థానాల్లోనూ ఓట‌మి చ‌విచూశారు. అయినా ప‌వ‌న్ మాత్రం నిరాశ చెంద‌లేదు. మ‌రింతం ఉత్సాహంతో ప‌ని చేశారు. పార్టీని నిర్మించుకోవ‌డం ముఖ్య‌మ‌ని ఓట్లు చీల‌డ‌మే పార్టీ ఓట‌మికి కార‌ణ‌మ‌ని గ్ర‌హించారు.

2024 ఎన్నిక‌ల‌కు ముందు నుంచే టీడీపీతో పోత్తు ఉంటుంద‌ని సంకేతాలు ఇస్తూ వ‌చ్చారు. ఆ మేర‌కు బీజేపీని కూడా కూట‌మిలో క‌లిపి పోటీ చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హరించారు. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ త‌న అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్నారు. తాను పోటీ చేసిన పిఠాపురంలోనూ భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మరియు పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం, ముక్కుసూటిగా మాట్లాడ‌ట‌మే ప‌వ‌న్ బ‌లం. ఏ విష‌యాన్నైనా నాన్చ‌కుండా నిర్మొహ‌మాటంగా స‌మాధానం చెప్ప‌గ‌ల‌డు. ఇవే ఆయ‌న‌కు ప‌లు స‌మ‌స్క‌లు తెచ్చిపెట్టింది. స‌న్నిహితుల‌ను దూరం చేసింది. అయినా ఆయ‌న క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చాడే కానీ వెన‌క‌డుగు మాత్రం వేయ‌లేదు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలే చేస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పాడు. త‌న విధానాలు న‌చ్చిన‌వారే త‌న‌తో ఉంటార‌ని త‌న‌ను విమ‌ర్శించే వారు వెళ్లిపోవ‌చ్చ‌ని నిర్మొహమాటంగా చెప్ప‌గ‌ల‌గిన ధైర్యం ఆయ‌న‌ సొంతం. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న ప‌ట్టించుకోడు.. మ‌నల్ని ఎవ‌డ్రా ఆపేది అంటూ ముందుకే సాగుతుంటారు. పవన్ రాబోయే కాలంలో రాజకీయాల్లో మరింతగా రాణించాలని  ఆశిస్తూ మరోసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

   --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com