హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు..

- September 02, 2024 , by Maagulf
హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు..

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి వరదనీటిలోనే బోట్లపై నిర్వారామంగా పర్యటించారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వరద సహాయక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా హోమంత్రి అనిత విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు. అయితే, విజయవాడలోని హోమంత్రి నివాసాన్నికూడా వరద నీరు చుట్టుముట్టాయి.

రామవరప్పాడు వంతెన దిగువన జలదిగ్భందంలో హోమంత్రి అనిత నివసించే కాలనీ ఉంది. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత వారిని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె ఏర్పాట్లు చేశారు. తన ఇంటి వద్దకు వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి వరద బాధితులకు సహాయసహకారాలు అందించాలని హోమంత్రి సూచించారు. మరోవైపు విజయవాడలో వరద బాధితులకు ఆహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు దుర్గగుడి అధికారులతో మాట్లాడారు. ఇవాళ 50వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు ప్రైవేట్ హాటల్స్ యాజమానులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఉదయంలోపు లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని సూచించారు.

ప్రకాశం బ్యారేజీ, బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పలు కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ వరదల కారణంగా తొమ్మిది మంది మృతిచెందారు. కొండచరియలు విరిగిపడి ఆరుగురు, వరదలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్సార్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ – కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com