ప్రకాశం బ్యారేజీ గేటును ఢీకొట్టిన బోటు.. దెబ్బతిన్న గేట్లు?
- September 02, 2024
అమరావతి: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కనీవినీ ఎరగని స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. చరిత్రలోనే తొలిసారిగా బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు తెరిచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఎగువ నుంచి కొట్టుకువచ్చిన ఓ బోటు 69వ నెంబర్ గేటును ఢీ కొట్టింది. దీంతో స్వల్పంగా డ్యామేజీ జరిగింది. బోటు ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందని అధికారులు పరిశీలిస్తున్న క్రమంలోనే మరో నాలుగు బోట్లు కొట్టుకొచ్చాయి.
దీంతో అధికారులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కొట్టుకువచ్చాయా లేక ఎవరైనా కావాలని బోట్లను వదిలారా అని అనుమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచాలనే ఉద్దేశంతో బోటు అడ్డుతగిలిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం నీటి ప్రవాహాన్ని పెంచేందుకు ప్రయత్నించింది. తాజాగా నాలుగు బోట్లు కొట్టుకురావడంతో నాడు జరిగిన సంఘటనను అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈ బోట్లు కొట్టుకురావడం వెనక ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద 23.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఈ స్థాయిలో వరద గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ దిగువన పలు గ్రామాలు నీటమునిగాయని వివరించారు. గేట్లను పూర్తిగా పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బ్యారేజీపై రాకపోకలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు, రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలో ప్రకాశం బ్యారేజీకి 1903వ సంవత్సరంలో 10.60 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 2009 అక్టోబర్ లో 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ప్రస్తుతం 11.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!