తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక 'సర్దార్ జమలాపురం కేశవరావు'

- September 03, 2024 , by Maagulf
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక \'సర్దార్ జమలాపురం కేశవరావు\'

నిజాం నిరంకుశ పాలనలో బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛ కోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం ముందుకు సాగారు. హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన వ్యక్తిగా, క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా కొన్ని ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్ రాజ్యప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన మహోన్నతుడు కేశవరావు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. నేడు సర్దార్ జమలాపురం కేశవరావు గారి జన్మదినం.

దక్కన్ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు నిజాం సంస్థానంలోని తూర్పు భాగాన ఉన్న ఖమ్మం జిల్లా (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెం గ్రామంలో 1908, సెప్టెంబర్ 3 న జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మలకు తొలి సంతానంగా జన్మించారు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని తీవ్రంగా కలవరపరిచాయి. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలో కాలూనారు. గీతాన్ని ఆలపించనివ్వకపోతే తరగతులకు హాజరు కాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు.

ఈ ఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధి మరింత విస్తృతం అయింది. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయారు. ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో… ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితుడయ్యారు. 1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేసే బాధ్యత వహించారు. 1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్ర మహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది.  

హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా నిరసించిన మొట్టమొదటి కాంగ్రెస్ వ్యక్తి కేశవరావు. అప్పటి మిలిటరీ అధికారి నంజప్పను నిలదీసిన నిజమైన ప్రజానాయకుడు సర్దార్. కాంగ్రెస్ పార్టీలో ఉండి జాగీర్దార్లను, జమీందార్లను విమర్శించమంటే ఆనాడు నిజంగా ఒక సాహసమే. నంజప్ప నేతృత్వంలో మిలిటరీ వారు కమ్యూనిస్టుల ఏరివేత పేరిట జరిగిన హింసా కాండను, ముస్లింల ఊచకోతను కేశవరావు ఖండించారు. ప్రజల పక్షాన నిలిచారు. “మనం ఏ ప్రభుత్వాన్ని అయినా సరే అది రాష్ట్ర, జాతీయ ప్రభుత్వం, కాంగ్రెసు ప్రభుత్వం అయినా, కాంగ్రెసు కాని ప్రభుత్వం అయినా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్నిసహించబోము.

నంజప్ప మన ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మన ప్రజలకు సేవకుడు. ఆయన యధేచ్ఛగా ప్రవర్తించడానికి, మేము అనుమతించడానికి సిద్ధంగా లేము. ఆయన చేస్తున్న అకృత్యాలు నిజాం తొత్తులైన జాగీర్దార్లను, నాజీ హిట్లరును తలదన్నిన నిజాంను మరిపిస్తున్నది. నంజప్ప తెలంగాణ రక్షకుడిగా కాక, భక్షకుడిగా వచ్చినట్లు అనిపిస్తున్నది” అని డోర్నకల్లులో జరిగిన సభలో కేశవరావు ఎలుగెత్తి చాటారు.

1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్బంధానికి గురికావడం గమనార్హం.నిజాం సంస్థానం భారత దేశంలో విలీనమైన తరువాత 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి, కర్రలు కూడా నాటి నిరాడంబరతకు, పార్టీపట్ల అంకితభావంకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, అంతలా పార్టీకి సేవ చేసిన ఆయనకు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల మూలంగా రావాల్సినంత పేరు, దక్కాల్సిన గౌరవం రాలేదు. చేపట్టిన ప్రతి ఉద్యమం లోనూ విజయాల్ని సాధించిన ఆయన స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ద్రోహం చేశారు.ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందేలా పరిస్థితులు కల్పించారు.

తెలంగాణ కేసరిగా, ‘దక్కన్ సర్దార్’గా బిరుదులందుకున్న జమలాపురం కేశవరావు తనదైన శైలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగు వారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు. ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిబద్ధత కలిగిన నేత, త్యాగశీలి సర్దార్ జమలాపురం కేశవరావు.జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలోని నాయకులు చేసిన మోసం, కలగలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయిన కేశవరావు 1953, మార్చి 29న తన 46వ ఏట మరణించారు.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com