ఉపాధ్యాయుల మార్గదర్శి....!
- September 05, 2024ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజనీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పదవులకే వన్నెతెచ్చిన భరతమాత ముద్దుబిడ్డ. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ, చొరవ తనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఇంతటి గొప్ప ఖ్యాతిని ఆర్జించిన ఆయన పేరు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్. నేడు భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం.
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888,సెప్టెంబర్ 5న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందిన వీరి కుటుంబం తిరుత్తణికి వలస వెళ్ళింది. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో జరిగింది. రాధాకృష్ణ తొలిసారి బడిలో చేరినప్పుడు.. రిజిస్టర్‌లో రాధాకృష్ణ అనే పేరుకు బదులు అక్కడి తమిళ టీచరు తనదైన శైలిలో రాధాకృష్ణన్ అని రాయటంతో నాటి నుంచి ఆయన పేరు అలాగే కొనసాగింది. బాల్యం నుంచే రాధాకృష్ణన్ అసాధారణమైన తెలివితేటలతో టీచర్లను ఆశ్చర్యపరచేవారు.
నిజానికి రాధాకృష్ణన్ తండ్రి వీరాస్వామికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో తన కొడుకు కూడా ఏదో ఒక ఆలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అయితే.. తన కుమారుడి అద్భుత ప్రతిభను చూసి ఎంత కష్టమైన పడి తనను పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు.1896లో తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఫిలాసఫీ (తత్వశాస్త్రం) చదివారు. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌లతోనే జరిగింది.
సర్వేపల్లి 21 ఏళ్ల వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్‌గా ఆహ్వానించింది. తత్వశాస్త్రం మీద ఆయన ఉపన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకునేవి. వీరి గురించి విన్న అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ అశుతోష్ ముఖర్జీ(జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ తండ్రి).. కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయణ్ని ఆహ్వానించారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్న సమయంలో సర్వేపల్లి ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు అక్కడికి వెళ్లారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా ఆయనదే. 1931లోనే రాధాకృష్ణన్ ‘లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటీ’ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1931లో అప్పటి మద్రాస్ ప్రభుత్వంతో వచ్చిన భేదాభిప్రాయాల మూలంగా వ్యవస్థాపక వైస్ ఛాన్స్‌లర్, విద్యావేత్త సర్ సి.ఆర్. రెడ్డి రాజీనామా చేయగా తర్వాత ఐదేళ్లు(1931-36) ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లరుగా పనిచేశారు.1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యాపకులుగా పనిచేశారు. ఇదే సమయంలో యూరోప్ మొత్తం పర్యటిస్తూ తత్వశాస్త్రం మీద ఉపన్యాసాలు ఇచ్చారు. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948- 52 మధ్యలో యునెస్కోలో భారత ప్రతినిధిగా, అనంతరం రష్యాలో భారత దేశ రాయబారిగా పనిచేశారు.1952-62 మధ్య ప్రధాని నెహ్రు కోరిక మేరకు భారత ఉపరాష్ట్రపతిగా,1962లో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. 1954లో భారతరత్న పురస్కారంతో ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. భారతీయ తాత్విక చింతనతో బాటు పశ్చిమదేశాల మహాకావ్యాలు, కళలు, దర్శనాలను రాధాకృష్ణన్ లోతుగా అధ్యయనం చేసి, తూర్పు – పశ్చిమ దేశాల తాత్విక చింతనలకు వారధిగా నిలిచి, మారిన పరిస్థితులకు అనుగుణంగా వాటిపై వ్యాఖ్యానాలు చేశారు.
తత్వశాస్త్ర ప్రధాన శాఖలైన మెటాఫిజిక్స్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఎథిక్స్, సైకాలజీలను అధ్యయనం చేసి, పలు గ్రంథాలు రాశారు. వాటిలో ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘రెలిజియన్ అండ్ సైన్స్’, ‘రికవరీ ఆఫ్ ఫెయిత్’ విస్తృత ప్రాచుర్యం పొందాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, బుద్ధుని దమ్మపదాలను అసాధారమైన ప్రమాణాలతో ఇంగ్లిష్‌లోకి అనువదించి, ఆ వెలుగులను పశ్చిమ దేశాలకు ప్రసరింపజేశారు.
తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక గొప్ప మార్గమని రాధాకృష్ణన్ భావించారు. భారతీయ తత్వాన్ని అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్స అని, భారతీయ తాత్వికచింతన ఏ ఇతర ఆలోచనా రీతుల కంటే తక్కువ కాదని నిరూపించారు. భారతీయ తాత్విక చింతనను ఇంగ్లిష్‌లో పాశ్చాత్య ప్రపంచానికి అందించి, మెప్పించిన ధీశాలిగా నిలిచారు. పాశ్చాత్య తత్వవేత్తలు చెబుతున్న భావనలు.. ప్రాచీన భారతీయ వేదాంతంలో ఉన్నాయని ఉదాహరణలతో నిరూపించారు.
సర్వేపల్లి వ్యక్తిగత జీవితానికి వస్తే 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు శివకామమ్మతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడు సర్వేపల్లి గోపాల్ సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు. భారత మాజీ క్రికెటర్ వీ.వీ.ఎస్. లక్ష్మణ్ ఆయనకి దగ్గరి బంధువు. రాధాకృష్ణన్ మనవలు, మనవారాళ్ళు పబ్లిక్ పాలసీ, మెడిసిన్, లా, బ్యాంకింగ్, బిజినెస్, పబ్లిషింగ్ రంగాల్లో రాణిస్తున్నారు.
భారతీయ సమాజంలో గురువుకు ఉన్న విలువ ఎంతటిదో చెప్పే ఒక ఉదాహరణ ఇది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనిషిలోని అజ్ఞానపు తెరలను తీసి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సర్వేపల్లి రాధాకృష్ణన్. వర్సిటీలు జ్ఞాననిలయాలుగా నిలిచి, కొత్త ఆవిష్కరణలు చేయాలని, దేశం స్వావలంబన దిశగా, సార్వభౌమ స్వతంత్ర దేశంగా రూపొందాలని చెబుతూ అందుకు ఎలాంటి విద్యావిధానం కావాలనేది రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది.
దేశంలో కాలేజీలు పెరగాలని, విద్యా వ్యవస్థను కేవలం ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యపై పెట్టే ఖర్చును.. ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్ కోసం వెచ్చించే పెట్టుబడిగా భావించాలని ఆయన సూచించారు. ‘ఉపాధ్యాయులు సమాజంలో అత్యున్నత మేధోజీవులు. చరిత్రను మలచడంలో, సామాజిక పునర్నిర్మాణంలో దారిచూపే దార్శనికులు. టీచర్లకు బోధనాంశాల పట్ల ప్రేమ, తమ శిక్షణలో విద్యార్థులు ఎదగాలనే ఆకాంక్ష ఉండాలి’ అని అనేవారు. క్లాసులో టీచర్ – స్టూడెంట్ నిష్పత్తి తక్కువగా ఉంటేనే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, మార్మికతను, మేధోపరమైన భావావేశాలను వ్యక్తం చేయగలరని స్పష్టం చేశారు.
‘ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగించడం, వ్యక్తుల వికాసానికి, జీవితోన్నతికి తోడ్పడే సృజనాత్మక సమాజ నిర్మాణమే విద్య లక్ష్యం’ అని ఆయన ఎలుగెత్తి చాటారు. ‘భయమంటే తెలియని, అన్యాయాన్ని సహించని, నైపుణ్యం, సామర్థ్యం, దృక్పథం, సాహసం, విలువలతో కూడిన విద్యార్థులను తయారుచేయడమే’ విద్యాసంస్థల విధ్యుక్త ధర్మమని ఆయన ఉద్బోధించారు.
విద్య వ్యక్తులలో వివేచనను, సమతుల్యతను, మంచి చెడుల విచక్షణను కలిగిస్తుందన్నారు. ఒక దేశం భవిష్యత్తు.. అక్కడి విద్యాసంస్థలను చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. సంపదను పెంపొందించే, అసమానతలు తగ్గించే, సామాజిక, ఆర్థిక అభ్యున్నతిని సాధించే, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉజ్వల భారతదేశాన్ని నిర్మించేందుకు విద్యను ఒక ముఖ్యసాధనంగా చేసుకోవాలని పదే పదే చెప్పేవారు.
విద్యాసంస్థల్లో వాణిజ్య దృక్పథం అసమానతల సమాజానికి, పలు ఇతర దుష్ఫలితాలకు దారితీస్తుందని ఆనాడే హెచ్చరించారు. సత్వాన్వేషణ, సహనం, శ్రద్ధాసక్తులు పక్షపాతం లేకుండా ఉండడం, శ్రమపై గౌరవం వంటి విలువలను మన విద్యా విధానం పెంపొందించాలని ఆకాంక్షించారు. సైన్స్ మారణాయుధాలు, ప్రపంచ యుద్ధాలకు దోహదపడుతూ.. మానవాళి మనుగడను, మానవీయ విలువలను ప్రశ్నార్ధకం చేస్తోందని, ఈ చెడు ధోరణి పోవాలంటే, విద్యాబోధనలో సామాజిక, నీతిశాస్త్రాల బోధనను తప్పనిసరి చేయాలని రాధాకృష్ణన్ అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఆయన గుర్తుగా 1962 నుండి ప్రతీ సంవత్సరం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5ను "జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం"గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?