తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!

- September 07, 2024 , by Maagulf
తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!

హైదరాబాద్: వినాయక చవితి నాడు తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్ ను తిరిగి రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా నియమించింది. ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అదే విధంగా పలు కీలక హోదాల్లోని అధికారులను మార్పు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం అయిదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ ప్రస్తుత పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని బదిలీ చేసింది. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఏరి కోరి ఎంపిక చేసారు. అయితే, ఇప్పుడు ఆయన పైన బదిలీ వేటు చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీవీ ఆనంద్ ను రాష్ట్రానికి రప్పించి హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా నాడు నియమించారు.

అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నాడు డీజీపీ అంజనీ కుమార్ తో సహా సీపీగా ఉన్న ఆనంద్ ను సైతం తప్పించింది. ఆ తరువాత రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత సీవీ ఆనంద్ ను ఏసీబీ డీజీగా నియమించారు. అయితే..కొంత కాలంగా హైదరాబాద్ లో శాంతి భద్రతల పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు నుంచి గణపతి ఉత్సవాలు మొదలయ్యాయి. త్వరలో గణేష్ నిమజ్జనం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో హైడ్రా నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో, నగర పోలీసు కమిషనర్ ను మార్పు చేసినట్లు భావిస్తున్నారు.

తాజా ఉత్తర్వుల్లో ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. అదే విధంగా ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మరి కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com