65 వసంతాలు పూర్తి చేసుకున్న దూరదర్శన్

- September 16, 2024 , by Maagulf
65 వసంతాలు పూర్తి చేసుకున్న దూరదర్శన్

న్యూ ఢిల్లీ: ఒక‌ప్పుడు టీవీ చాన‌ల్ అంటే దూర‌ద‌ర్శ‌న్ గుర్తుకు వ‌చ్చేది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ చానెల్ ప్రసారాల కోసం దేశ ప్రజలంతా అమితాసక్తితో ఎదురు చూసేవారు. ఇంటిల్లిపాదినీ ఆలరించే ప్రసార సంస్థగా దూరదర్శన్ గతంలో వన్నెకెక్కింది. రామాయణ్, మహాభారత్ వంటి అనేక హిట్ కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అలా, ప్రైవేట్ టీవీ చాన‌ల్స్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఓ వెలుగు వెలిగింది. అలాంటి దూరదర్శన్ ప్రస్థానంలో ఓ మైలురాయికి చేరింది.

డీడీ ప్రారంభించి 65 ఏళ్లు పూర్తయ్యాయి. 1959 సెప్టెంబరు 15వ తేదీన ఈ చాన‌ల్‌ను ప్రారంభించారు. 1982లో ఇది జాతీయ ప్రసారకర్తగా అవతరించింది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 46 స్టూడియోలు ఉన్నాయి. దూరదర్శన్ కింద 33 టీవీ చానళ్లు ఉన్నాయి. ఇందులో డీడీ నేషనల్, డీడీ న్యూస్ పాన్ ఇండియా చానళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, దూరదర్శన్ ఆధీనంలో 17 ప్రాంతీయ చానళ్లు, 11 రాష్ట్ర స్థాయి నెట్‌వర్క్‌లు, ఓ ఇంటర్నేషనల్ చానల్ (డీడీ ఇండియా) ఉన్నాయి. క్రీడా ప్రసారాల కోసం డీడీ స్పోర్ట్స్, సాంస్కృతిక, సమాచార, వ్యవసాయ అంశాల ప్రసారం కోసం డీడీ భారతి, డీడీ ఉర్దూ, ఓ వ్యవసాయ చానల్ ఉన్నాయి. 80వ దశకంలో మహాభారత్, రామాయణ్ వంటి సీరియళ్లతో ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ చానల్ సందడి చేసింది. అయితే, 90వ దశకం ఆరంభంలో ఆర్థిక సంస్కరణలకు తెరలేపడంతో ఎన్నో ప్రైవేటు చానళ్లు భారత్‌లో ప్రవేశించాయి. అప్పటి నుంచి దూరదర్శన్‌కు ప్రజాదరణ తగ్గడం మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com